తెలంగాణ

political: పిల్లల విషయంలో నేతల ఎస్కేప్ పాలిటిక్స్‌.. బాధ్యత ఎవరిది?..

రచన: Venu••7 నిమిషాల పఠనం

పార్టీ ఏదైనా పదవులు ఏవి ఉన్నా.. రాజకీయం అంటే రాచకీయం అనేలా మారిందనే ఆరోపణలున్నాయి. ఎన్నికలకు ముందు ప్రజల మనిషిగా జీవిస్తూ.. అంటే నటిస్తూ.. ప్రజలే దేవుళ్ళు అని రోడ్లు పట్టుకుని ప్రచారాలు చేసే నాయకులు.. ఎన్నికలు ముగియగానే పరాయివాళ్ళలా ప్రవర్తించడం తెలిసిందే.

రాజకీయం అంటే నాలుగు అబద్ధాలు.. నలుగురిలో ప్రగల్భాలు.. అందినకాడికి దోచుకోవడాలు కాదు.. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, వాటి పరిష్కారానికి నిర్ణయాలు తీసుకోవడం, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, అధికారాన్ని బాధ్యతగా ఉపయోగించడమే రాజకీయం.. సింపుల్‌గా చెప్పాలంటే.. ప్రజల కోసం అధికారం ఉపయోగించే వ్యవస్థే రాజకీయం.. అయితే నేటి రాజకీయాలు ఇందుకు విరుద్దంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..

పార్టీ ఏదైనా పదవులు ఏవి ఉన్నా.. రాజకీయం అంటే రాచకీయం అనేలా మారిందనే ఆరోపణలున్నాయి. ఎన్నికలకు ముందు ప్రజల మనిషిగా జీవిస్తూ.. అంటే నటిస్తూ.. ప్రజలే దేవుళ్ళు అని రోడ్లు పట్టుకుని ప్రచారాలు చేసే నాయకులు.. ఎన్నికలు ముగియగానే పరాయివాళ్ళలా ప్రవర్తించడం తెలిసిందే. ఇక పదవులు దక్కించుకున్న వాళ్ళు ప్రజా సేవ మాటను మూటకట్టి అటకమీదకు నెట్టి.. తమ రాజకీయ భవిష్యత్తు గురించి రాజకీయాలు చేస్తూ ఎదుగుతారు.

మరోవైపు అప్పటి వరకు గుర్తుకు రాని స్కామ్ లు, దోపిడీలు, తప్పులు గుర్తుకు వస్తాయి.. వాటి మీద అనర్గళంగా స్పీచ్ లు ఇస్తూ.. రాజకీయ గొడుగు కింద జ్ఞానోదయమైనట్టు ప్రవర్తిస్తారు. అదంతా ఎందుకు రాజకీయాల్లో నటించే నాయకుల మీద.. తెరమీద నటించే నటులు కూడా పనికి రారని అంటారు. ఇలా సమాజంలోని బాధ్యతలు, బరువులు మోస్తున్నట్టు బిల్డప్ ఇచ్చే నేతలు.. ప్రజా సేవకోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెబుతారు. అయితే ప్రజలకు నాయకుడిగా ఉండాలంటే ముందు స్వంత ఇంటిలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి..

పిల్లలపెంపకం పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. తమ కుటుంబంలోని సమస్యలనే పరిష్కరించలేని నేతలు ఇక సమాజాన్ని, రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఏం ఉద్దరిస్తారనే విమర్శలున్నాయి.. నాయకత్వం అనేది కేవలం స్టేజీలపై ఉపన్యాసాలు దంచడానికో, ఓట్ల కోసం హామీలు ఇవ్వడానికో పరిమితం కాకూడదు. సొంత ఇంటిని క్రమశిక్షణలో ఉంచలేని వారు, సమాజానికి ఆదర్శంగా ఎలా నిలవగలరు? ప్రజా ప్రతినిధుల ప్రవర్తన మాత్రమే కాదు, వారి కుటుంబాల క్రమశిక్షణ కూడా ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తుంది.

ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో కొండా సురేఖ ఇచ్చిన వివరణ.. గతంలో బండి భగీరత్ విషయంలో బండి సంజయ్ మాట్లాడిన మాటలపై ప్రజల్లో చర్చ మొదలైంది. రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు తప్పు చేస్తే ఆ నాయకులకు సంబంధం లేదా? పిల్లలు వేరు, మేము వేరు అంటూ చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం? అనే ప్రశ్నలు తలెత్తాయి..

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన వివాదం కావచ్చు, లేదా మంత్రి కొండ సురేఖ కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలు కావచ్చు.. ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు నాయకులు ఆ తప్పుతో మాకు ఎలాంటి సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రకటనలు ఇచ్చి సరిపెట్టుకుంటున్నారు. ఇక కొడుకు బండి భగీరథ వ్యవహారంలో తన పేరు వాడొద్దని బండి సంజయ్ కోర్టుకెళ్లడం విడ్డూరమని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాం. గత ప్రభుత్వాల హయాంలోనూ కొందరు కీలక నేతల పిల్లలు లేదా బంధువులు డ్రగ్స్ వ్యవహారాల్లో, ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణల్లో, లేదా రోడ్డు ప్రమాదాల కేసుల్లో చిక్కుకున్న దాఖలాలు ఉన్నాయి. సామాన్యుడి ఇంట్లో పిల్లాడు తప్పు చేస్తే ఆ కుటుంబం మొత్తం సమాజంలో తలదించుకోవాల్సి వస్తుంది. పెంపకం సరిగ్గా లేదంటూ తల్లిదండ్రులను నిందిస్తారు.

అదే అధికారంలో ఉన్న నాయకుల పిల్లలు తప్పు చేస్తే మాత్రం రాజకీయ రంగు పులమడమో, లేదా వ్యక్తిగత విషయమని దాటవేయడమో జరుగుతోంది. సమాజంలో చట్టం అందరికీ ఒకేలా ఉండాలి. అధికారం, హోదా ఉన్నంత మాత్రాన బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. నాయకులు తమ పరిపాలనలో ప్రజా సమస్యలను ఎలా తీరుస్తున్నారో, అలాగే తమ ఇంట్లోని వారిని సమాజానికి బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడంలో కూడా అంతే శ్రద్ధ చూపించాలనే వాదనలు నెటిజన్స్ నుండి వినిపిస్తున్నాయి.

పిల్లలు ఏం మాట్లాడుతున్నారు. ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏం చేస్తున్నారనేది తల్లిదండ్రులకు తెలియదు అనడం హర్షించదగ్గ విషయం కాదని అంటున్నారు. తప్పు ఎవరు చేసినా తప్పే.. హోదాలు, పదవులు చట్టానికి అతీతం కావు. ఇప్పటికైనా నేతలు ఈ విషయాన్ని గ్రహించి, మాటల్లోనే కాదు చేతల్లోనూ బాధ్యతాయుతంగా నడుచుకుంటారని ఓట్లు వేసిన ప్రజలు ఆశిస్తున్నారు..

#Telangana#political#bandi sunjay#kondaa surekha#kondaa susmitha
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి