భారతీయ చిత్రపరిశ్రమ ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యభరితమైన సినీ ప్రపంచాల్లో ఒకటిగా నిలిచింది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ వంటి అనేక భాషల్లో సినిమాలు నిర్మిస్తూ మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, భావోద్వేగాలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది.. అయితే అప్పుడప్పుడు కొన్ని అపవాదులు మూటగట్టుకుందనే ఆరోపణలున్నాయి. అలాగే అంతకంటే ఎక్కువే రికార్డులు సొంతం చేసుకుందనే ప్రశంసలు కూడా ఉన్నాయి..
ఇక రికార్డుల కోసం చెప్పుకోవలసి వస్తే.. షావుకారు జానకి సాధించిన రికార్డ్ చిత్రపరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఈ నటి నాలుగు తరాల ముఖ్యమంత్రులతో నటించి చరిత్ర సృష్టించారు. దీంతో భారతీయ చలనచిత్ర చరిత్రలోనే మరే ఇతర నటికీ సాధ్యంకాని అత్యంత అరుదైన, మహోన్నత గౌరవం పద్మశ్రీ షావుకారు జానకిగారి సొంతం అయ్యింది. ఇక వెండితెరకు 1949లో వచ్చిన షావుకారు చిత్రంతో పరిచయమైన ఈ నటి.. ఆ సినిమా పేరే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు..
అలాగే షావుకారు జానకి దక్షిణాది రాజకీయాలను, రజతోత్సవ సినీ రంగాన్ని దశాబ్దాల పాటు ఏలిన నలుగురు దిగ్గజ ముఖ్యమంత్రులలో.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.టీ. రామారావు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎం.జీ. రామచంద్రన్, జయలలిత, ఎం. కరుణానిధితో తెర పంచుకుని, ఆల్ టైమ్ రికార్డును తన పేరు మీద లిఖించుకున్నారు. ఇలా మొత్తం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటిస్తూ.. ఏకంగా 450కి పైగా చిత్రాల్లో నటించి ఏడు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు.
ఇలాంటి నటి నేడు తన జీవిత ప్రస్థానాన్ని ముగించారు.. ఈ ప్రపంచాన్ని వదిలి నింగికి ఎగిశారు. ఈ దిగ్గజ నటి మృతి పట్ల సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.. .మరోవైపు షావుకారు జానకిగారి లాగే, గతంలో మరణించిన పలువురు నటీమణులు కూడా సినీ ప్రపంచంలో ఎవరూ అధిగమించలేని సరికొత్త రికార్డులను నెలకొల్పారు.. వారిలో మహానటి సావిత్రి ఒకరు.. దక్షిణాది సినీ చరిత్రలోనే ఒక మహిళా నటికి కథానాయకులతో సమానంగా, కొన్నిసార్లు వారి కంటే ఎక్కువ పారితోషికం అందుకుందంటే ఆ ఏకైక నటి సావిత్రి అని చెబుతారు.. అలాగే ఒకే ఏడాదిలో అత్యధికంగా లీడ్ రోల్స్ చేసిన నటిగానూ ఆమె పేరిట చెరగని రికార్డు ఉంది.
అలాగే భారతీయ చిత్రసీమలో తొలి మహిళా సూపర్‌స్టార్ గా గుర్తింపు పొందిన ఘనత శ్రీదేవికి దక్కుతుంది. పురుషాధిక్యత కలిగిన సినీ రంగంలో, ఏ హీరో అండ లేకుండా కేవలం తన స్టార్‌డమ్‌తోనే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇక తమిళ సినీ చరిత్రలో అత్యధికంగా 85కు పైగా సినిమాల్లో ఒకే హీరో (ఎంజీఆర్) సరసన జోడీగా నటించి గిన్నిస్ రికార్డు నెలకొల్పిన నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత.. అదేవిధంగా ఒకే దశాబ్దంలో అత్యధిక సిల్వర్ జూబ్లీ హిట్ చిత్రాల్లో నటించిన కథానాయికగా కూడా ఆమె రికార్డు సృష్టించారు.
మరోవైపు 90లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వరుసగా అత్యధిక సక్సెస్ రేట్ సాధించిన నటిగా సౌందర్య రికార్డ్స్ సృష్టించినట్టు చెబుతారు.. కన్నడ, తెలుగులో ఆమె నటించిన సినిమాలు వరుసగా కమర్షియల్ విజయం సాధించడమే కాకుండా, ఉత్తమ నటిగా అత్యధిక ఫిల్మ్‌ఫేర్, నంది అవార్డులను అందుకున్నారు.. ఇక షావుకారు జానకిగారు సాధించిన ఈ అరుదైన రికార్డుతో పాటు, ఈ దిగ్గజ నటీమణులు నెలకొల్పిన చరిత్ర భారతీయ చిత్రసీమకు ఎప్పటికీ చిరస్మరణీయం!


