తెలంగాణ

Karimnagar: కలెక్టరేట్ ముట్టడించిన పాలిటెక్నిక్ విద్యార్థులు.. జీవో 97 రద్దుకు పెరుగుతున్న డిమాండ్!..

రచన: Venu••5 నిమిషాల పఠనం

రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను.. సాంకేతిక విద్యా వ్యవస్థను ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఈ జీవో 97 ను జారీ చేశారు.

తెలంగాణలో సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థుల్లో ప్రస్తుతం తీవ్ర ఆందోళన నెలకొంది. రాష్ట్ర విద్యాశాఖ ఇటీవల తీసుకువచ్చిన జీవో 97 ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.. ఒకవైపు ప్రభుత్వం ఈ ఉత్తర్వుల ద్వారా సాంకేతిక విద్యలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని చెబుతుంటే, మరోవైపు విద్యార్థి సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల సమస్యల ను పరిష్కరించాలని నిరసనకు దిగారు.. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలని, జీవో నం. 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ క్రమంలో ముందస్తూ జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించా రు.

మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో తీసుకువస్తున్న విధానాల ద్వారా పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులను ఐటిఐ, ఏటీసీలతో అనుసంధానం చేయడం విద్యార్థుల భవిష్య త్తును దెబ్బతీసే నిర్ణయమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాలిటెక్నిక్ విద్య అనేది ప్రత్యేకమైన సాంకేతిక విద్యా వ్యవస్థ అని, ఈ కోర్సు ప్రమాణాలను మరింత మెరుగు పరచాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా డిప్లమా కోర్సులను ఇతర శిక్షణా కోర్సులతో అనుసంధానం చేయడం సరికాదనే విమర్శలున్నాయి..

ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల విద్యా ప్రమాణాలు, ఉన్నత విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జీవో నం. 97ను వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను బలోపేతం చేయాలని, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు..

రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను.. సాంకేతిక విద్యా వ్యవస్థను ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఈ జీవో 97 ను జారీ చేశారు. పరిశ్రమలకు అవసరమైన విధంగా పాలిటెక్నిక్ విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడమే ఈ జీవో ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంటుంది.. మరోవైపు ప్రభుత్వ పాలిటెక్నిక్ వ్యవస్థను స్కిల్ యూనివర్సిటీకి అప్పగించడం అంటే మెల్లగా ప్రైవేటీకరణ వైపు అడుగులు వేయడమేనని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటి వరకు ఉచితంగా లేదా నామమాత్రపు రుసుముతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు లభించే పాలిటెక్నిక్ విద్య, భవిష్యత్తులో ప్రైవేట్ మోడల్‌లోకి మారితే ఫీజులు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

అలాగే మూడేళ్ల డిప్లొమా ప్రాధాన్యత తగ్గి, బి.టెక్ లేదా ఇతర ఉన్నత చదువులకు వెళ్లే లేటరల్ ఎంట్రీ అవకాశాలు దెబ్బతింటాయని ఆరోపిస్తున్నారు.. ప్రస్తుతం ఈ జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని.. లేదంటే విద్యార్థులకు నష్టం కలగకుండా మార్పులు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల వద్ద ధర్నాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి..

#Telangana#Karimnagar#ECET#Polytechnic students#Collectorate#GO 97
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి