Raghunandan Rao: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ రద్దు అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కాగా, తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై రేవంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ కోణంలోనే అనుమతి నిరాకరించారని రేవంత్ ఆరోపించారు. దేశ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని తాను నమ్ముతానని అన్నారు. విద్యా వ్యవస్థకు సంబంధించిన తన పర్యటనను అడ్డుకోవడంపై కేంద్రం యువతకు సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్స్
రేవంత్ అమెరికా పర్యటన రద్దు అంశంలో కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై తెలంగాణ బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. సీఎం రేవంత్ యూఎస్ టూర్ రద్దుపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు, భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఆగస్టు సంక్షోభం భయంతోనే రేవంత్ తన టూర్ ను రద్దు చేసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు రహస్య మీటింగ్స్ నిర్వహిస్తున్నారని, ఆ భయంతోనే పర్యటన రద్దు చేసుకున్నారని వ్యాఖ్యానించారు.
కేంద్రం మీద, ప్రధాని మీద బురద చల్లే ప్రయత్నం
''ఏ ముఖ్యమంత్రి అయినా దేశం దాటి బయటకు వెళ్తున్నప్పుడు అనుమతులు దేనికి అవసరం ఉంటాయి? ఫారిన్ టూర్ కి వెళ్లే ముందు ఏ ముఖ్యమంత్రి అయినా భారత ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి వెళ్తారు. ఆ దేశాల్లో సెక్యూరిటీ తదితర సమస్యలు ఉంటాయి కనుక సమాచారం ఇస్తారు. రాహుల్ గాంధీ 58సార్లు వేరే దేశాలకు వెళ్లారు. భారత ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే వెళ్లారు. అమెరికా వెళ్లేందుకు పర్మిషన్ తీసుకున్నా అని రేవంత్ అంటున్నారు. మరి పర్మిషన్ కాపీ ఇచ్చారా? పోనీ పర్మిషన్ రద్దు చేసిన కాపీ ఇచ్చారా? ఏదీ ఇవ్వకుండానే కేవలం కేంద్ర ప్రభుత్వం మీద, ప్రధాని నరేంద్ర మోదీ మీద బురద చల్లే కార్యక్రమం పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి.
లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చినోళ్లు అమెరికాకు వెళ్లేందుకు ఎందుకివ్వరు?
లండన్ కు వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చిన వాళ్లు అమెరికాకు వెళ్లేందుకు ఎందుకివ్వరు? అసలు మీకు ముందుగా ఇచ్చిన పర్మిషన్ కాపీ ఎక్కడుంది? పర్మిషన్ రద్దు చేసిన కాపీ ఎక్కుడుందో చూపండి. పర్మిషన్ ఇవ్వలేదు, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అనడం.. ఇదంతా డ్రామా తప్ప మరొకటి కాదు. ఆగస్టు సంక్షోభం వస్తుందనే భయంతోనే రేవంత్ రెడ్డి ఇలా ఆగమాగం చేస్తున్నారు. దానికి భారత ప్రభుత్వాన్ని బద్నాం చేయడం ఎందుకు?
సీఎంను మార్చాలని 30మంది ఎమ్మెల్యేల రహస్య మీటింగ్?
ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగోలేదు. మంత్రి పదవి రాలేదని ఒక ఎమ్మెల్యే, మంత్రి కుమార్తె.. ఇలా రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిని మార్చాలని 20 -30 మంది ఎమ్మెల్యేలు ఏదో మీటింగ్ పెడుతున్నారనే సమాచారం సీఎంకూ తెలిసి ఉంటుంది. అలాంటి సమాచారం ఏదో రావడంతోనే రేవంత్ తన అమెరికా టూర్ రద్దు చేసుకుని ఉంటారు. తన సొంత పార్టీ మీద మాట్లాడటం ఇష్టం లేకనే బయటోళ్ల మీద రుద్దే కార్యక్రమం చేశారు తప్ప మరొకటి కాదు. భారత ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దుకు ఎలాంటి సంబంధం లేదు'' అని రఘునందన్ రావు తేల్చి చెప్పారు.


