నేటి సమాజంలో నైతిక విలువలు అనేవి భూతద్దం పెట్టి వెతుక్కోవలసిన పరిస్థితులు నెలకొన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా గ్లామర్ ప్రపంచంలో కోట్లాది రూపాయల రెమ్యునరేషన్- విపరీతమైన క్రేజ్ ఉన్న వారు సైతం విలువలను కాపాడుకుంటలేరనే ఆరోపణలున్నాయి. డబ్బు ఎవరికి ఊరికే రాదు.. కానీ డబ్బు సంపాదించే మార్గాలే మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయని అంటారు..
అలాంటి వారు మన భారతీయ చిత్రపరిశ్రమలో చాలా అరుదుగా కనిపిస్తారనే టాక్ ఉంది. ముఖ్యంగా సమాజం విషయంలో బాధ్యతను, నైతిక విలువలను ప్రధానంగా భావించే కొందరు స్టార్లు కేవలం డబ్బు లేదా పబ్లిసిటీ కోసం కాకుండా తమ నిర్ణయం సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఆలోచించి కొన్ని అవకాశాలను, ప్రకటనలను తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి.
అలాంటి వారిలో సూపర్ స్టార్ రజనీకాంత్ తన సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో వ్యాపార ప్రకటనల ఆఫర్లను.. కొన్ని రకాల పాత్రలను నిరాకరించారు. కోట్లు సంపాదించుకునే అవకాశాలు వచ్చినా మద్యం, పొగాకు వంటి సమాజానికి హాని చేసే ఉత్పత్తులను ప్రచారం చేయడానికి ఒప్పుకోలేదు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన సిద్ధాంతాలకు కట్టుబడి కొన్ని ఏళ్ల క్రితం ఒక సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ అంబాసిడర్‌గా భారీ ఆఫర్ వచ్చినా ప్రజల ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులను ప్రచారం చేయనని తెగేసి చెప్పారు.
అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి కూడా సమాజానికి తప్పుడు సందేశం వెళ్లే మద్యం, గుట్కా వంటి బ్రాండ్‌లను ప్రచారం చేసే ఆఫర్లను నైతిక విలువల కోసమే తిరస్కరించారు. కానీ సామాజిక సేవ, ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకు మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.. తాజాగా నటుడు సిద్ధార్థ్ కూడా ఐటమ్ సాంగ్స్ కు విషయంలో స్పందిస్తూ.. సమాజానికి చెడు సందేశం ఇచ్చే కంటెంట్‌కు తాను దూరంగా ఉంటానని వెల్లడించారు.
కేవలం వీరు మాత్రమే కాకుండా.. సౌత్ నుండి నార్త్ వరకు మరికొందరు స్టార్లు కూడా ఇదే బాటలో నడిచారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మనీ-మేకింగ్ ప్రకటనలకు దూరంగా ఉంటూ కేవలం సామాజిక స్పృహ ఉన్న కార్యక్రమాలకే ప్రాధాన్యతనిచ్చారు. అలాగే అల్లు అర్జున్ కూడా పుష్ప విజయం తర్వాత పొగాకు బ్రాండ్ ప్రకటనను తిరస్కరించారని ప్రచారం జరిగింది.
మరోవైపు సైమన్, సాయి పల్లవి వంటి నటీమణులు కూడా ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల ప్రకటనలను నిరాకరించి తమ నైతికతను చాటుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో డబ్బుల కోసం పాన్ మసాలాలు, గుట్కా వంటి ప్రకటనల్లో కనిపించి షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి హీరోలు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయిన సదరు స్టార్లు తప్పును అంగీకరించకుండా, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతిని తెలిసిందే..
ఇక ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తి ఏదైనా దానిని పండించకూడదు... లేదా మార్కెటింగ్ కి ప్రభుత్వాలు అనుమతించకూడదు. ఆదాయం కోసం ప్రభుత్వాలు అనుమతించగా, తాము ప్రకటనలో నటిస్తే తప్పేంటని షారూఖ్ నిలదీసే ప్రయత్నం చేసారు. చూశారా ఎంత మని ఉన్న ఇలాంటి హానికరమైన యాడ్స్ చేస్తూ విలువలేని బతుకులు బతుకుతున్న స్టార్స్ మధ్య.. నైతిక విలువల కోసం ప్రకటనలు, ఐటమ్ పాటల్లో నర్తించే అవకాశాల్ని కూడా కొందరు వదులుకోవడం అభినందనీయమని మెచ్చుకుంటున్నారు. వారి నిజాయితికి నెటిజన్స్ సెల్యూట్ చేస్తున్నారు..


