తెలంగాణ

Cm Revanth Reddy: అందుకే.. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వలేదు- కేంద్రం కీలక వ్యాఖ్యలు

రచన: NK••7 నిమిషాల పఠనం

Cm Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు అంశం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్రం తన యూఎస్ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కోణం ఉందని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అడ్డుపడుతున్నారని విమర్శలు చేశారు.

Cm Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు అంశం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్రం తన యూఎస్ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక రాజకీయ కోణం ఉందని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అడ్డుపడుతున్నారని విమర్శలు చేశారు. అటు ఈ అంశంలో రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నేతలు మాటల యుద్ధానికి దిగారు.

అమెరికా పర్యటన ఉద్దేశంలో స్పష్టత లేదు

వివాదం ముదురుతున్న తరుణంలో కేంద్రం స్పందించింది. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వలేదో తెలియజేసింది విదేశీ వ్యవహారాల శాఖ. సీఎం హోదాకు తగినట్లుగా ఆ పర్యటన లేదని కేంద్రం తెలిపింది. అమెరికా పర్యటన ఉద్దేశంలో కూడా స్పష్టత లేదని చెప్పింది. అందుకే రేవంత్ అమెరికా టూర్ కు అనుమతి లభించలేదని విదేశీ వ్యవహారాల శాఖ వివరణ ఇచ్చింది. అయితే రేవంత్ బ్రిటన్ పర్యటనకు మాత్రం అనుమతి ఇచ్చినట్లు గుర్తు చేసింది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు రాజకీయ అనుమతి నిరాకరించడంపై అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సమాధానం ఇచ్చారు. ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల పర్యటనలకు రాజకీయ అనుమతి ఇచ్చే ముందు మంత్రిత్వ శాఖ వాటిని సమీక్షిస్తుందని రణధీర్ జైస్వాల్ తెలిపారు.

"ఇతర ప్రముఖుల మాదిరిగానే, ముఖ్యమంత్రుల పర్యటనలకు కూడా రాజకీయ అనుమతిని మంజూరు చేసే ముందు విదేశీ వ్యవహారాల శాఖ వాటిని పరిశీలిస్తుంది. అటువంటి సందర్భాల్లో ప్రతిపాదించే కార్యక్రమం వారు నిర్వహిస్తున్న పదవికి, పర్యటన ఉద్దేశానికి తగినట్లుగా ఉండాలి. అమెరికాకు సంబంధించిన ఈ నిర్దిష్ట విషయంలో అలా జరగలేదు, అందుకే అనుమతి ఇవ్వలేదు" అని జైస్వాల్ పేర్కొన్నారు. అయితే, రేవంత్ రెడ్డి లండన్ పర్యటనకు రాజకీయ అనుమతి లభించిందని ఆయన స్పష్టం చేశారు.

లండన్ నుంచి నేరుగా హైదరాబాద్‌కు

తాను ప్రతిపాదించిన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంతో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం తమ అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విధంగా స్పందించింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, ముఖ్యమంత్రి ప్రతిపాదిత బ్రిటన్, అమెరికా పర్యటనల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి అనుమతి కోరగా, కేవలం బ్రిటన్ పర్యటనకు మాత్రమే అనుమతి లభించింది. అధికారిక బృందం బ్రిటన్ చేరుకున్న తర్వాతే అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు సీఎం కార్యాలయం పేర్కొంది. దీంతో, బోస్టన్‌కు వెళ్లే బదులు రేవంత్ రెడ్డి ఆగస్టు 23న లండన్ నుంచి నేరుగా హైదరాబాద్‌కు తిరిగి వస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

దేశం విషయంలో రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా ఆలోచన చేయాలి

''నా అమెరికా పర్యటన ఉద్దేశ్యం.. ప్రపంచ స్థాయి విద్యాసంస్థలను తెలంగాణ, హైదరాబాద్‌కు తీసుకురావడం. అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి సంస్థలతో భాగస్వామ్యాలను అన్వేషించడం. కేంద్రం నూతన విద్యా విధానంలో భాగంగా, ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలను భారత్‌, తెలంగాణ, హైదరాబాద్‌కు తీసుకురావడమే ఈ పర్యటన ఏకైక లక్ష్యం" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు విషయంలో మనమందరం రాజకీయాలు, ఎన్నికలకు అతీతంగా ఆలోచించాలని నేను ఎప్పుడూ నమ్ముతాను అని రేవంత్ పేర్కొన్నారు.

తన అమెరికా పర్యటనకు అనుమతిని నిరాకరించడాన్ని "రాజకీయపరమైన నిరాకరణ"గా అభివర్ణించిన ముఖ్యమంత్రి, దీనిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయినప్పటికీ, కేంద్రం నిర్ణయానికి కట్టుబడి లండన్ నుండి భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన పర్యటన రద్దయినా అమెరికాలోని ప్రముఖ విద్యాసంస్థలతో ప్రతిపాదిత భాగస్వామ్యాలను కుదుర్చుకునే ప్రక్రియను కొనసాగించాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి.

#Cm Revanth Reddy#Telangana#America Tour#MEA#US Tour#Swechaa News#Cm Revanth Reddy US Trip
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి