రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ‘ఎస్ఐఆర్’ ప్రక్రియను చేపట్టగా సుమారు 70 లక్షలకు పైగా ఓట్లు గల్లంతైన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఎస్ఐఆర్ ప్రక్రియను సీరియస్‌గా తీసుకున్నారు.రాష్ట్రంలో ఇంత పెద్దఎత్తున ఓట్లు డిలీట్ అయ్యాయని, కాంగ్రెస్ నేతలు ఏం చేస్తున్నారని ఆమె సీరియస్ అయినట్టు సమాచారం. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సహా పీసీసీ చీఫ్ మిగతా రాష్ట్రస్థాయి నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో ఆమె జూమ్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం 2% ఓట్లతోనే అని గుర్తుచేశారు.ఇకమీదట జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్టు సమాచారం. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా లక్షల ఓట్లు తొలగిపోతున్నాయని, ఆ ఓట్లను కాపాడే బాధ్యత మనదేనని నాయకులకు ఆమె తేల్చి చెప్పినట్టు సమాచారం. కేవలం 2 శాతం ఓట్లతో అధికారాన్ని ఏర్పాటు చేసిన మనకు ..ఇన్ని ఓట్లు తొలగిపోతే భవిష్యత్‌లో గెలవడం కష్టతరంగా మారుతుందని, ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓట్లు తొలగిపోకుండా చూడాలని మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలను ఆదేశించినట్టు తెలిసింది.
ఇదిలాఉండగా, పెద్దఎత్తున ఓట్లు పోతున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం కాంగ్రెస్ నేతలపై మండిపడినట్టు సమాచారం. కాంగ్రెస్ నేతలతో మాట్లాడిన సీఎం.. మీ నిర్లక్ష్యం వల్లే ‘సర్’లో 73 లక్షల ఓట్లు పోతున్నాయంటూ ఎమ్మెల్యేలు, మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. రేపు మనం ఓడిపోతే తనకు సంబంధమే లేదని టీపీసీసీ జూమ్ మీటింగ్‌లో రేవంత్ వ్యాఖ్యానించినట్టు సమాచారం.
ఇన్‌చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల నిర్లక్ష్యం వల్లే ఓట్లు పోయాయని, తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో ఉండి ఓట్లు తొలగిపోకుండా చూడకుండా హైదరాబాద్‌లో ఏం చేస్తున్నారని మండిపడినట్టు తెలిసింది. ఇక్కడే ఉండి ఎస్ఐఆర్ ప్రక్రియను సమీక్షిస్తానంటే ఎలా? అని ప్రశ్నించినట్టు సమాచారం. అందరూ క్షేత్రస్థాయిలోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ సానుభూతి ఓట్లు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇన్‌చార్జి జిల్లా మంత్రులు,ఎమ్మెల్యేల మీద ఉందని పేర్కొన్నట్టు తెలిసింది. ఇదిలాఉండగా, ప్రస్తుతం ఓటరు జాబితాలో పేరు లేని వారికి నోటీసులు పంపిస్తున్న ఈసీ.. తమ పౌరసత్వాన్ని రుజువు చేసుకోవాలని, అందుకోసం భారత ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపుకార్డులను చూపించాలని కోరింది. అప్పుడు మరల ఓటు హక్కు పునరుద్ధరిస్తామని ఈసీ తెలిపింది. ఈ క్రమంలోనే ఎస్ఐఆర్ ప్రక్రియ మీద కాంగ్రెస్ పార్టీ విస్తృత స్తాయిలో సమీక్షలు నిర్వహిస్తున్నది.


