ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజాలు అయిన అమెజాన్, ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్‌లకు సంబంధించిన ఫుడ్ లైసెన్సులను కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ రద్దు చేసింది. నిబంధనలు అతిక్రమించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే, ఆహారంగా తీసుకునేందుకు ఎందుకు పనికిరాని, విషపూరితమైన ఉమ్మెత్త కాయలు, వాటి విత్తనాలను స్టోర్ చేసి మరీ విక్రయిస్తున్నారనే ఆరోపణలు రావడంతో కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
అమెజాన్, ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్ కోల్డ్ స్టోరేజీల్లో ఉమ్మెత్త కాయలు,వాటి విత్తనాలు లభ్యం కావడంతో ఆయా సంస్థల ఫుడ్ లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేస్తూ కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మెత్తకాయలు ఆరోగ్యానికి తీవ్ర హానికరం చేస్తాయి. అసలు వీటిని ఎందుకు విక్రయిస్తున్నారు? కోల్డ్ స్టోరేజీల్లో ఎందుకు భద్రపరిచారు? ఎవరికి అమ్ముతున్నారు? అనే అంశాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే వీటిని స్టోర్ చేసి విక్రయిస్తున్న అమెజాన్, ఇన్ స్టామార్ట్, బిగ్ బాస్కెట్ సంస్థల ప్రతినిధులకు విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.
సదరు సంస్థల ప్రతినిధులు విచారణలో భాగంగా అధికారుల ముందు హాజరైనప్పటికీ, వారి ఇచ్చిన వివరణల పట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు సంతృప్తి చెందలేదని సమాచారం. అమెజాన్ ఎటువంటి సమాధానం ఇవ్వకపోగా, ఇన్‌స్టామార్ట్ కాస్త సమయం కోరినట్టు తెలిసింది. బిగ్‌బాస్కెట్ మాత్రం ఇప్పటికే విక్రయాలు నిలిపివేశామని, భవిష్యత్తులో ‘మనుషులు వినియోగించరాదు’ అని లేబుల్ వేస్తామని వెల్లడించింది.
విషపూరిత ఉత్పత్తులను ఆహార పదార్థాలుగా నిల్వ చేయడంతో పాటు విక్రయించిన సంస్థలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే అమెజాన్, ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లకు జారీ చేసిన ఆహార లైసెన్సులను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిలిపివేయాలని నిర్ణయించారు. తదుపరి విచారణలో సరైన వివరణ ఇస్తే తప్ప ఈ సస్పెన్షన్ ఎత్తివేసే ప్రసక్తి లేదని కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అధికారులు తేల్చిచెప్పినట్టు సమాచారం.ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లకు ఉమ్మెత్త కాయలు, విత్తనాలు సరఫరా చేసిన విక్రేతలు, సప్లయర్ల లైసెన్సులను కూడా తక్షణమే రద్దు చేయడంతో పాటు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఉమ్మెత్త విక్రయ ప్రకటనలు, లిస్టింగ్‌లను వెంటనే తొలగించాలని ఆదేశాలిచ్చారు.


