తెలంగాణ

కాళేశ్వరంపై కాంగ్రెస్ ‘దుష్ప్రచారం’ పటాపంచలు.. రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ధ్వజం!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తిగా కుప్పకూలిందని, నీటిని ఎత్తలేమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రచారం అబద్ధమని ఎన్డీఎస్‌ఏ (NDSA) అఫిడవిట్, సీడబ్ల్యూపీఆర్‌ఎస్ (CWPRS) నివేదికల ద్వారా స్పష్టమైందని బీఆర్ఎస్ జాతీయ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఆరోపించారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తిగా కుప్పకూలిందని, నీటిని ఎత్తలేమంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రచారం అబద్ధమని ఎన్డీఎస్‌ఏ (NDSA) అఫిడవిట్, సీడబ్ల్యూపీఆర్‌ఎస్ (CWPRS) నివేదికల ద్వారా స్పష్టమైందని బీఆర్ఎస్ జాతీయ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఆరోపించారు. అవసరాన్ని బట్టి కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయవచ్చని స్వయంగా ఎన్డీఎస్‌ఏ స్పష్టం చేయడంతో పాటు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలోని ఏ బ్లాక్‌లోనూ ఎలాంటి నిర్మాణపరమైన లోపాలు లేవని, కాంక్రీట్ నాణ్యత బాగుందని సీడబ్ల్యూపీఆర్‌ఎస్ తేల్చిచెప్పినట్లు ఆయన తెలిపారు.

ఆంధ్రాకు నీళ్లు.. తెలంగాణకు కన్నీళ్లు..

కేవలం రాజకీయ కక్షతో ప్రాజెక్టును పక్కనపెట్టి, గోదావరి నుంచి వస్తున్న లభ్యత నీటిని సద్వినియోగం చేసుకోకుండా కిందికి వదిలేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ క్రిమినల్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని హరీశ్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ నిలదీసిన తర్వాతే ఆలస్యంగా దేవాదుల, నంది పంపులను ప్రారంభించారని, ఆలోపే పూడ్చలేని విధంగా భారీగా వరద నీరు దిగువకు వెళ్లిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ వైఖరి వల్ల పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఉచితంగా నీళ్లు వెళ్లగా, తెలంగాణ రైతులకు మాత్రం కన్నీళ్లే మిగిలాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బిహార్‌తో పోటీ పడేస్థాయికి దిగజారాం

నీటి నిర్వహణ లోపం వల్ల దేశవ్యాప్తంగా జలాశయాల్లో సగటున 64.16శాతం నీటి నిల్వలు ఉండగా, తెలంగాణలోని రిజర్వాయర్లలో కేవలం 35.6శాతం నీరు మాత్రమే అందుబాటులో ఉందన్నారు. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలో నీటి నిల్వలు సగానికి పడిపోవడం భవిష్యత్తు నీటి సంక్షోభానికి సంకేతమని హెచ్చరించారు. కేసీఆర్ నాయకత్వంలో నీటి నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ, నేడు కాంగ్రెస్ వైఫల్యం వల్ల జలాశయ నిల్వల విషయంలో బిహార్‌తో పోటీ పడే స్థాయికి దిగజారిందని ఆయన ఎద్దేవా చేశారు.

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని విపక్షాలు, ఇంజినీర్లు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాజకీయం మానేసి అన్నారం, సుందిళ్ల మోటార్లను వెంటనే ఆన్ చేసి గోదావరి నీటిని ఎత్తిపోసి, రిజర్వాయర్లు నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని హరీశ్ రావు బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు.

#HarishRao#KaleshwaramProject#BRS#TelanganaFarmers#RevanthGovt#GodavariWaters#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి