ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో భారీ భూదందా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని భూ యజమానుల సంతకాలను ఫోర్జరీ చేసి కోట్లాది రూపాయల విలువైన భూములను హస్తగతం చేసుకునేందుకు యత్నించడం సంచలనంగా మారింది. అసలు యజమానులకు తెలియకుండా వారి పేర్లతో 'డెవలప్‌మెంట్ అగ్రిమెంట్-కమ్-ఇర్రెవొకబుల్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (GPA)' సృష్టించి అక్రమాలకు పాల్పడిన కేసులో పోలీసు రిమాండ్ కేస్ డైరీ (RCD) ఆధారంగా సంచలన నిజాలు బయటపడ్డాయి.
బాధితుడి ఫిర్యాదు ప్రకారం, కందుకూరు రెవెన్యూ గ్రామంలోని తన సుమారు 9ఎకరాల 27 గుంటల విలువైన భూమిని తన అనుమతి గానీ, ప్రమేయం గానీ లేకుండా ఫోర్జరీ సంతకంతో డెవలప్‌మెంట్ అగ్రిమెంట్‌లో చేర్చారని పోలీసులు స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న కొందరు వ్యక్తులు, తమ భూములను అమ్మడానికి నిరాకరించిన యజమానుల భూ రికార్డులను అక్రమంగా సేకరించారు. ఆపై వారి సంతకాలను ఫోర్జరీ చేసి అగ్రిమెంట్లు సృష్టించడం ద్వారా వారిపై ఒత్తిడి తెచ్చి భూములు గుంజుకోవడానికి యత్నించారని పోలీస్ నివేదిక పేర్కొంది.
ఈ తీవ్రమైన నేరానికి సంబంధించి పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 318(4), 338, 336(3), 340(2) రెడ్ విత్ 3(5) కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా జమ్మలమడుగుకు చెందిన పోలిశెట్టి మల్లికార్జున (A1), కందుకూరుకు చెందిన మర్రిపల్లి శ్రీనివాస్ (A2)తో పాటు మొత్తం నలుగురు నిందితులను ఆగస్టు 24న పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి 2024 మార్చి 26 నాటి 18 పేజీల నకిలీ జీపీఏ పత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు అపరిమితంగా రెక్కలు రావడంతో రియల్ మాఫియా ఇలాంటి అక్రమాలకు పాల్పడుతోందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. భూ యజమానులు అప్రమత్తంగా ఉండి, తమ ఆస్తులకు సంబంధించిన డెవలప్‌మెంట్ అగ్రిమెంట్లు, జీపీఏలు, భూ రికార్డులను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని పోలీసులు సూచించారు.


