కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలతో జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో, కేసు నమోదైన తర్వాత సుమంత్‌ను అదుపులోకి తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించిన ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నట్టు సమాచారం..
కొద్ది రోజుల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణను కార్యాలయానికి పిలిపించి, 10 కోట్లు డిమాండ్ చేశారని, ఈ క్రమంలో డబ్బులు ఇవ్వడానికి అతను నిరాకరించడంతో సుమంత్ ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డాడానే ఆరోపణలున్నాయి.. ఈ నేపథ్యంలో బాధితుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా సుమంత్‌తో పాటు మరో ఐదుగురిపై హత్యాయత్నం కేసు నమోదైంది.
మొదట మేడిపల్లి పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కేసును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. అప్పటికే పరారీలో ఉన్న సుమంత్ కోసం పోలీసులు గాలిస్తున్న క్రమంలో ఆయన వ్యక్తిగత డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. తాజాగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో నిందితులపై చర్యలతో పాటు కేసు నమోదు, దర్యాప్తు ప్రక్రియలో పోలీసుల పాత్రపైనా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగానే సీఐ ముత్తు యాదవ్‌పై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటి వరకు చిక్కకుండా పరారీలో ఉన్న మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం నగర పోలీసుల గాలింపు ఇంకా కొనసాగుతోంది.
మరోవైపు సుమంత్ గతంలో సూర్యాపేటలో ఒక ప్రైవేట్ సిమెంట్ కంపెనీ ప్రతినిధులను గన్‌తో బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో ఆయనను అరెస్ట్ చేయడానికి వెళ్లిన టాస్క్ ఫోర్స్ పోలీసులతో మంత్రి కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.


