కేబినెట్ మంత్రుల మధ్య కనిపించని సయోధ్య
ఫ్యూచర్ సిటీపై సాధ్యంకాని అబద్ధాల ప్రచారం
నిబంధనల ఉల్లంఘనే విదేశీ పర్యటన రద్దుకు కారణమా?
క్లియరెన్స్ దరఖాస్తును ఎందుకు దాస్తున్నారు?
రేవంత్ ప్రభుత్వం నిజాలు వెల్లడించాలని డిమాండ్
తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రికి, ఆయన మంత్రివర్గ సహచరులకు మధ్య కనీస సయోధ్య లేదని సచివాలయ వేదికగానే బయటపడిందని ఆయన ఆరోపించారు. సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి కూర్చున్న 10 నిమిషాల తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రావడం వారి మధ్య ఉన్న తీవ్ర విభేదాలకు అద్దం పడుతోందన్నారు. ఒకే కేబినెట్ సబ్ కమిటీలో ఉండి కూడా మంత్రులు సమయానికి హాజరు కాకపోవడం పాలనా రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
అలాగే హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ వేదికగా అంతర్జాతీయ ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన హార్వర్డ్ (85 ఏళ్ల చరిత్ర గల బిజినెస్ స్కూల్/బోస్టన్), కేంబ్రిడ్జ్, 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాలు తమ ప్రధాన ప్రాంగణాలు ఉన్న ప్రాంతాల్లో తప్ప ప్రపంచంలో ఎక్కడా కొత్త క్యాంపస్‌లు తెరవవని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి విదేశీ వర్సిటీలను ఇక్కడికి రప్పిస్తామనడం కేవలం ప్రజలను మోసం చేయడమేనని, అది ఏమాత్రం సాధ్యం కాని విషయమని కొట్టిపారేశారు.
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనల రద్దు వ్యవహారంపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. నిబంధనల ప్రకారం విదేశీ పర్యటనకు కనీసం 15 రోజుల ముందే ‘పొలిటికల్ క్లియరెన్స్’ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, కేవలం 5 రోజుల ముందే ఎందుకు అప్లై చేశారని నిలదీశారు. సీఎం హోదాలో చేయకూడని కార్యక్రమాలు షెడ్యూల్‌లో ఉన్నందుకే కేంద్ర ప్రభుత్వం పర్యటనను నిలిపివేసిందనే వార్తలపై రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణ ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అమెరికా పర్యటన రద్దు వెనుక పొలిటికల్ కుట్ర ఉందని కాంగ్రెస్, నిబంధనల ఉల్లంఘన జరిగిందని బీజేపీ ఆరోపించుకోవడమే తప్ప అసలు నిజాలను బయటపెట్టడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. నిజంగా ఈ విషయంలో పారదర్శకత ఉంటే రెండు పార్టీలు కలిసి రేవంత్ రెడ్డి పొలిటికల్ క్లియరెన్స్ కోసం పెట్టుకున్న దరఖాస్తు పత్రాలను ప్రజల ముందుకు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా నిజాలను బయటపెట్టాలని ఆయన రేవంత్ సర్కార్‌ను డిమాండ్ చేశారు.


