హైదరాబాద్ మహానగరంలో మరోసారి మాయాగాళ్లు పోలీసులకు చిక్కారు. నకిలీ క్లినిక్స్ తెరిచి తాము డాక్టర్లం అని చెప్పుకుని వీరంతా రోగులకు చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది. ఎలాంటి విద్యార్హత లేకుండా వైద్యం చేస్తున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో రంగంలోకి దిగి వారిని పట్టుకున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 11 మంది నకిలీ డాక్టర్లు అరెస్ట్ కావడం హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపింది.
ఎలాంటి వైద్య అర్హతలు, కనీసం ప్రాక్టిస్ చేసిన ధ్రువపత్రాలు కూడా లేకుండా వీరు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టు తెలిసింది. నకిలీ డాక్టర్ల ముఠాను సిటీ పోలీసులు పట్టుకోవడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. నగరంలోని పలు ఏరియాల్లో వీరంతా గుట్టుగా క్లినిక్స్ రన్ చేస్తున్నట్టు సమాచారం. కనీస వైద్య విద్యార్హతలు, డిగ్రీలు లేకపోయినా.. పెద్ద మొత్తంలో ప్రిస్క్రిప్షన్ రాస్తూ ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్స్ ఇస్తూ సామాన్య ప్రజలను మోసగిస్తున్నట్లు పోలీసులు తేల్చారు.
వీరిలో కొందరు నకిలీ సర్టిఫికెట్లతో ప్రైవేట్ క్లినిక్‌లు నడపడమే కాకుండా, మరి కొందరు ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల పేర్లను వాడుకుంటూ వైద్య సేవలు అందిస్తున్నట్లు విచారణలో తేలింది. సదరు మాయగాళ్ల క్లినిక్‌ల నుంచి భారీ ఎత్తున నకిలీ లెటర్‌హెడ్‌లు, అనుమతి లేని మందులు, వైద్య పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమాయక ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్న ఇలాంటి నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సిటీ పోలీసులు తెలిపారు. అర్హత లేని వ్యక్తుల వద్దకు వెళ్లి చికిత్సలు చేయించుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని నగర పోలీసులు నగరవాసులకు సూచనలు చేశారు.
ఎవరైనా వైద్యుల మీద అనుమానం కలిగితే వెంటనే సమాచారం అందించాలని,వారి భరతం పడతామని సిటీ పోలీసులు అంటున్నారు. కొందరు నకిలీ వైద్యులు చేస్తున్న పనుల వలన నిజమైన వైద్యులకు చెడ్డపేరు వస్తుందని, ప్రజలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలాఉండగా, 11 మంది నకిలీ డాక్టర్ల పేర్లు, పూర్తి స్థాయి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.












