రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల విషయంలో రాష్ట్ర బీజేపీ చేపట్టిన ఆందోళన ఉత్కంఠకు దారితీసింది. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఫీజు బకాయి-బీజేపీ లడాయి పేరుతో నిరాహార దీక్ష చేపట్టింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి నిరాహార దీక్షలో కూర్చున్నారు. అయితే, సుదీర్ఘ సమయం పాటు ఆహారం, నీళ్లు తీసుకోకుండా దీక్ష కొనసాగించడంతో మధ్యాహ్నానికి ఆయన ఆరోగ్యం క్షీణించి అస్వస్థతకు గురైయ్యారు.
రాంచందర్ రావు అస్వస్థతకు గురికావడంతో వెంటనే వైద్యులు దీక్షా శిబిరంలోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయన రక్తపోటు 90/60కి పడిపోయినట్లు వైద్యులు గుర్తించారు. ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉందని భావించిన వైద్య బృందం విశ్రాంతి తీసుకోవాలని, నిరాహార దీక్షను విరమించాలని సూచించింది. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు ఆయన నిరాహార దీక్షను విరమించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు ఒక్కరోజు దీక్షతో ఫీజు రీయింబర్స్మెంట్ అంశం ముగిసిపోదని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను పూర్తిగా విడుదల చేసే వరకు విద్యార్థుల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించి, బకాయిలను విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. అవసరమైతే రానున్న రోజుల్లో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని పార్టీ నేతలు హెచ్చరించారు.


