దేశవ్యాప్తంగా విద్యార్థుల జీవితాలతో చెలాగాటం ఆడుతున్న ప్రశ్నాపత్నం లీకేజీ అంశంపై పలు రాష్ట్రాలలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. జీవితాన్ని ఉన్నత స్థాయిలో ఊహించుకుని కష్టపడి చదివి పాసై ఏదో సాధించాలని తపన పడుతున్న యువత ఆశయాలకు తూట్లు పొడుస్తూ, వారి ఆశలను చిదిమేసున్న లీకేజి దళారుల పట్ల ప్రభుత్వాలు అత్యంత కఠినంగా వ్యవహరించ వలసిన అవసరం ఉంది.
ఇప్పటికే ప్రశ్నపత్రాల లీకేజి వ్యవహారం పై ఢిల్లీలో జరిగిన సంఘటన గుర్తు ఉండే ఉంటుంది. ఒక సెంట్రల్ మినిష్టర్ రాజీనామా చేయవలసి వచ్చింది. అయిన ఈ వివాదం సమసిపోలేదు. ఏదో ఒక రాష్ట్రంలో ఈ వ్యవహారం పై ఆందోళనలు జరుగుతున్నాయి..
ఇక తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో ప్రశ్నాపత్నం లీకేజీ పై విద్యార్థి సంఘాలు హైటెన్షన్ క్రియేట్ చేశారు.. ప్రశ్నాపత్నం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు..
గాంధీ మైదాన్‌లో గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతోన్న విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియల్లో అవినీతిని అరికట్టి, పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత పాటించాలని కోరుతూ.. ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి నివాసం ముట్టడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో జేపీ గోలంబర్ దగ్గర బారికేడ్లను ఛేదించుకుని సీఎం ఇంటి వైపు దూసుకెళ్లారు. దీంతో సీఎం నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దీంతో అప్రమత్తం అయిన పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు.. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు పరిస్థితి అదుపు తప్పడంతో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు వాటర్ క్యానన్లను ఉపయోగించారు.
అదేవిధంగా సీఎం నివాసం దగ్గర భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా బలగాలను మోహరించారు. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో పోలీసులు, విద్యార్థులను వెంబడించి కొట్టిన వీడియోలు వైరల్‌గా మారాయి.


