కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు కొత్తేమీ కాదు.. అధికారం ఉన్నా, లేకపోయినా ఆ పార్టీలో లుకలుకలు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయని గతంలో పలు సందర్భాలలో నిరూపించబడింది కూడా.. నేతల మధ్య ఆధిపత్య పోరు.. పదవుల కోసం పోటీ.. ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకోవడం ఈ పార్టీలో తరచూ కనిపించే పరిణామాలే. అయితే అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్ర కాంగ్రెస్ తో పాటు అధిష్టానం సిద్దం అవుతున్న వేళ.. మంత్రి కొండా సురేఖ కూతురు, పార్టీ నాయకుడు చిన్నారెడ్డిల వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి..
ఇప్పుడు ఈ విభేదాలు మరోసారి తెరపైకి రావడంతో పార్టీ అంతర్గత వ్యవహారాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. నేతల మధ్య సమన్వయం లోపిస్తే.. దాని ప్రభావం పార్టీపై, ప్రభుత్వ పనితీరుపైనా పడే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కీలక నిర్ణయం తీసుకొనున్నట్టు సమాచారం.. మంత్రి కొండా సురేఖ, పార్టీ నాయకుడు చిన్నారెడ్డి ల వ్యాఖ్యలపై దాఖలైన ఫిర్యాదులపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తన విచారణను పూర్తి చేసి నివేదికను సిద్ధం చేసింది.
ఈ సమగ్ర నివేదికను క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఈమెయిల్ ద్వారా పంపించడంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు సమర్పించినట్టు తెలుస్తుంది.
ఇక గతంలోనూ పార్టీ వేదికలపై నేతల మధ్య విభేదాలు, బహిరంగ విమర్శలు చర్చకు వచ్చాయి. తాజాగా ఈ ఇద్దరు నేతలు వివిధ బహిరంగ వేదికలపై పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడారా? అన్న కోణంలో కమిటీ లోతుగా పరిశీలించినట్లు తెలుస్తోంది.
వారు చేసిన ప్రసంగాలకు సంబంధించిన వీడియో క్లిప్‌లను, ఇతర డిజిటల్ ఆధారాలను సేకరించి విశ్లేషించినట్లు సమాచారం. ఈ ఆధారాలతో కూడిన నివేదికను ఏఐసీసీకి అందించినట్లు ప్రచారం జరుగుతోంది. నివేదికను పరిశీలించిన తర్వాత కఠిన చర్యలకు ఏఐసీసీ సిద్ధమవుతోందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరందుకుంది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన రుజువైతే కొండా సురేఖ, చిన్నారెడ్డిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉందన్న ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.
మరోవైపు గతంలోనూ కొండా మురళి బహిరంగంగా పార్టీ నేతలపై విమర్శలు చేయడం వివాదానికి దారితీసింది. ఈ అంశాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలించి, ఇరువర్గాల మధ్య సయోధ్యకు ప్రయత్నించింది. అదేవిధంగా తరచుగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ నాయకత్వంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే.. ఈ వ్యవహారం కూడా క్రమశిక్షణ కమిటీ దృష్టికి వెళ్లింది.
అయితే గతంలో వివాదాలపై హెచ్చరికలు, చర్చలు, సయోధ్యలతో వ్యవహారాలను చక్కదిద్దే ప్రయత్నం జరిగింది. మరోవైపు పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలపై రవి శ్రీనివాస్‌ను ఆరేళ్ల పాటు సస్పెండ్ కూడా అయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ పొలిటికల్ సర్కిల్లో నెలకొంది...


