తెలంగాణ

ఇలా చేయండి మీ ఆదాయం పెంచుకోండి-పసుపు రైతులకు గవర్నర్‌ శుక్లా కీలక సూచనలు

రచన: NK••7 నిమిషాల పఠనం

రైతుల సంక్షేమమే రాష్ట్ర, దేశ సంక్షేమమని రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా అన్నారు. పసుపు సాగులో ఆధునిక సాంకేతికత, సహజ వ్యవసాయ పద్ధతులు, ప్రాసెసింగ్‌, విలువ ఆధారిత ఉత్పత్తులు, బలమైన మార్కెట్‌ అనుసంధానంతో రైతుల ఆదాయాన్ని పెంచాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో మంగళవారం పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించారు.

Governor Shiv Pratap Shukla: రైతుల సంక్షేమమే రాష్ట్ర, దేశ సంక్షేమమని రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా అన్నారు. పసుపు సాగులో ఆధునిక సాంకేతికత, సహజ వ్యవసాయ పద్ధతులు, ప్రాసెసింగ్‌, విలువ ఆధారిత ఉత్పత్తులు, బలమైన మార్కెట్‌ అనుసంధానంతో రైతుల ఆదాయాన్ని పెంచాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో మంగళవారం పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమక్షంలో ''సునహరి మిట్టి అభియాన్', మార్కెట్‌ అనుసంధాన కార్యక్రమాలను గవర్నర్ ప్రారంభించారు. ఉత్తమ రైతు సంఘాలకు మెమెంటోలు అందించి అభినందించారు. అనంతరం పసుపు రైతులను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు.

పసుపు సాగులో నిజామాబాద్ కు ప్రత్యేక గుర్తింపు

నిజామాబాద్‌కు పసుపు సాగులో ప్రత్యేక గుర్తింపు ఉందని గవర్నర్‌ అన్నారు. సారవంతమైన నేలలు, రైతుల కష్టంతో ఈ ప్రాంతం దేశంలోని ప్రముఖ పసుపు ఉత్పత్తి కేంద్రంగా ఎదిగిందన్నారు. ఇక్కడ జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు కావడం ఈ ప్రాంత రైతుల చిరకాల ఆకాంక్షకు ప్రతీకగా నిలిచిందన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక చొరవ, ప్రధాని మోదీ ఆశీస్సులతో ఇది సాకారమైందన్నారు. సాగును లాభదాయకంగా మార్చేందుకు ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని వెల్లడించారు.

పసుపు.. విలువైన సంపద

పసుపు కేవలం వ్యవసాయ ఉత్పత్తి మాత్రమే కాదని.. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, నిత్య జీవితంతో ముడిపడిన విలువైన సంపద అని గవర్నర్‌ పేర్కొన్నారు. భారత దేశ వ్యవసాయ వారసత్వానికి పసుపు ప్రతీకగా నిలుస్తోందన్నారు. భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారుగా కొనసాగించడంతో పాటు.. పసుపు ప్రాసెసింగ్‌, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చేయడమే జాతీయ పసుపు బోర్డు లక్ష్యమని గవర్నర్‌ తెలిపారు. పసుపు పండించే రైతుకు కష్టానికి తగిన గిట్టుబాటు ధర లభించడంతో పాటు.. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత పసుపుకు ప్రత్యేక గుర్తింపు లభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

సహజ వ్యవసాయంతో వ్యయం తగ్గుతుంది

రైతులకు నాణ్యత పెంపు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటకోత అనంతర నిర్వహణపై శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. బాయిలర్లు, పాలిషర్లు, చిన్నతరహా ప్రాసెసింగ్‌ యూనిట్లు రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు విలువ ఆధారిత ఉత్పత్తుల దిశగా దోహదపడతాయని తెలిపారు. సహజ వ్యవసాయం, ఎగుమతుల ప్రోత్సాహానికి దోహదపడే దూరదృష్టితో ‘సునహరీ మిట్టీ అభియాన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. రసాయన ఎరువులు, ఇతర ఇన్‌పుట్లపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా నేల సారాన్ని కాపాడటంతో పాటు.. పర్యావరణ పరిరక్షణ, సాగు వ్యయాన్ని తగ్గించేందుకు సహజ వ్యవసాయం తోడ్పడుతుందని అన్నారు.

నాణ్యతకు ప్రాధాన్యమిస్తే రైతులకు మెరుగైన ధరలు

అవశేష రహిత, నాణ్యమైన పసుపుకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉందని.. నాణ్యతకు ప్రాధాన్యమిస్తే రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు విదేశీ మార్కెట్లకు చేరుకునే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. మార్కెట్‌ అనుసంధాన కార్యక్రమాలు రైతులను నేరుగా దేశంలోని ప్రముఖ ఎగుమతిదారులతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తాయని గవర్నర్‌ అన్నారు. మార్కెట్‌ అవసరాలు, నాణ్యతా ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు.. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు మార్గదర్శకత్వం అందించాలని సూచించారు.

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

రైతులు, శాస్త్రవేత్తలు, ఎగుమతిదారులు, పరిశ్రమలు, ప్రభుత్వాలు సమష్టిగా పనిచేస్తే భారత పసుపును ఆసియా, యూరప్‌, అమెరికా మార్కెట్లలో మరింత బలోపేతం చేయవచ్చని గవర్నర్‌ అన్నారు. రైతులు కేవలం పంట ఉత్పత్తిదారులు మాత్రమే కాదని.. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అని గవర్నర్‌ పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది అన్నారు.

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, నాణ్యమైన పంటను పండిస్తూ, సమష్టి మార్కెటింగ్‌ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. “అన్నదాత సుఖీభవ” స్ఫూర్తితో రైతు సంపన్నుడిగా, నేల ఆరోగ్యంగా, ప్రపంచ మార్కెట్‌లో భారత్‌ అగ్రగామిగా నిలిచే వ్యవసాయ వ్యవస్థను నిర్మించాలి అని గవర్నర్‌ ఆకాంక్షించారు.

ఈ ప్రాంత పసుపు రైతుల నాలుగు దశాబ్దాల కలను నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో కేంద్రం నెరవేర్చిందని ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు. బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. పసుపు క్వింటాలు ఇచ్చే రేటు గతం కంటే పెరిగిందని వెల్లడించారు.

#Governor Shri Shiv Pratap Shukla#Turmeric Farmers#Natural Farming#Nizamabad#Sunhari Mitti Abhiyan#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి