Jagga Reddy: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దుపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. దీనిపై ప్రెస్ మీట్ పెట్టి మరీ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే కుట్ర జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా ఇదే అంశంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు.
ప్రధాని మోదీ పాక్ పర్యటనపై ఎందుకు మాట్లాడరు?
సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టే ఆయన అమెరికా టూర్ ను కేంద్రం అడ్డుకుందని జగ్గారెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి అధికారికంగా అమెరికా వెళ్తుంటే అడ్డుకున్న బీజేపీ.. ప్రధాని మోదీ అనధికార పాకిస్తాన్ పర్యటనపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు బర్త్ డే పార్టీ కోసం ప్రధాని మోదీ పాకిస్తాన్ వెళ్లారని ఆయన గుర్తు చేశారు.
ఎవరికీ చెప్పకుండా మోదీ పాకిస్తాన్ వెళ్లారు
''ముఖ్యమంత్రి రేవంత్ అమెరికా టూర్ ను కేంద్రం అడ్డుకోవడం దుర్మార్గం. ముఖ్యమంత్రిని కాదు తెలంగాణ ప్రజలను బీజేపీ అవమానించింది. రేవంత్ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? మోదీ ప్రధాని అయ్యాక ఎవరికీ చెప్పకుండా పాకిస్తాన్ వెళ్లారు. అనధికారికంగా మోదీ పాకిస్తాన్ వెళితే తప్పు లేదు కానీ అధికారికంగా సీఎం రేవంత్ అమెరికా వెళితే తప్పా? తన పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను సీఎం రేవంత్ విదేశాంగశాఖకు ముందే ఇచ్చారు. అందులో ఎలాంటి సీక్రెట్ లేదు.
ఇప్పుడే ఎందుకు ఆపాల్సి వచ్చింది?
రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్లడం కొత్తేమీ కాదు. పీసీసీ కాకముందు వెళ్లారు, పీసీసీ అయ్యాక కూడా వెళ్లారు. అమెరికాకు వెళ్లడం మామూలే కదా. అందరూ పోతున్నారు, వస్తున్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ అమెరికా వెళ్లకుండా ఇప్పుడే ఎందుకు ఆపాల్సి వచ్చింది? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అంత అవసరం ఏముంది? అంతటి ఎమర్జెన్సీ ఏమొచ్చింది?
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే కుట్ర
ముఖ్యమంత్రి కొన్ని యూనివర్సిటీలకు సంబంధించిన అధికార పర్యటనను అమెరికాలో పెట్టుకున్నారు. ఆ టూర్ ను బీజేపీ ప్రభుత్వం ఆపేసింది. ముఖ్యమంత్రి హోదాలో అమెరికా పర్యటనకు బయలుదేరితే ఏదో కారణం చూపి ఆపేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టే అడ్డుకున్నారు. ముఖ్యమంత్రిది ప్రధానంగా ఎడ్యుకేషన్ టూర్. ఈ టూర్ సక్సెస్ కావద్దని రాజకీయ కోణంలో టూర్ ని ఆపేశారు. తెలంగాణ విద్యార్థులు, ప్రజలు, మేధావులు అందరూ ఆలోచన చేయాలి. తెలంగాణ ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ కావొద్దని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రేవంత్ పర్యటనను అడ్డుకుందా? అనే అనుమానం వ్యక్తమవుతోంది'' అని జగ్గారెడ్డి అన్నారు.


