తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మరో అంశం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆల్ ఇండియా కాంగ్రెస్ వాలంటీర్స్ కమిటీ, అంటే ఏఐసీవీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమానికి బహిరంగంగా మద్దతు ఎందుకు ప్రకటించలేదో వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో కోరినట్లు తెలుస్తోంది.
ఇందుకు 72 గంటల గడువు ఇచ్చినట్లు ఏఐసీవీసీకి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు పేర్కొంటున్నాయి. రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేరళ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీలకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఏఐసీవీసీ పేర్కొంది.
మరోవైపు ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. రాహుల్ గాంధీ చేపట్టిన కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు బహిరంగంగా మద్దతు ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో, కొందరు కీలక నేతలకు నోటీసులు రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో ఏఐసీవీసీ తీసుకున్న ఈ చర్యపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
అసలు ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమానికి ఎందుకు మద్దతు ఇవ్వలేదనే అంశంపై రేవంత్ రెడ్డి ఎలాంటి వివరణ ఇస్తారు? 72 గంటల గడువులోగా సమాధానం ఇస్తారా? ఒకవేళ వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఏఐసీవీసీ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. మొత్తంగా రేవంత్ రెడ్డికి షోకాజ్ నోటీసుల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.
మరోవైపు మంత్రి కొండా సురేఖ కూతురు, పార్టీ నాయకుడు చిన్నారెడ్డిల వివాదం సమసిపోక ముందే.. మరో రాజకీయం అంశం తెరపైకి రావడంతో అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుందనే అయోమయంలో నేతలున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి ల వ్యాఖ్యలపై దాఖలైన ఫిర్యాదులపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తన విచారణను పూర్తి చేయగా.. వీరిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. ఇంతలోనే రేవంత్ రెడ్డికి ఏఐసీవీసీ షోకాజ్ నోటీసులు జారీ చేయడం చర్చాంశనీయంగా మారింది..


