భక్తికి ప్రతిరూపం, బలానికి ప్రతీక, ధైర్యానికి నిలువెత్తు రూపం హనుమంతుడు.. తనలో అపారమైన శక్తి ఉన్నా... ఆ స్వామిలో ఎక్కడా అహంకారం కనిపించదు. ఎంతటి కార్యమైనా శ్రీరాముడి ఆజ్ఞగా భావించి, నిస్వార్థంగా పూర్తి చేయడమే ఆయన గొప్పతనం.. వినయం, విశ్వాసం, ధైర్యం, క్రమశిక్షణ, సేవాభావం... ఇలా హనుమంతుడి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఎన్నో గుణాలు ఉన్నాయి..
కష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గని ఆత్మవిశ్వాసం.. ప్రభువు పట్ల చెక్కుచెదరని భక్తి... అందుకే హనుమంతుడు కేవలం దేవుడు మాత్రమే కాదు.. ప్రతి మనిషికి ధైర్యాన్ని నింపే ఆదర్శమూర్తి! అని పురాణాలు తెలియజేస్తున్నాయి. అయితే ఆ భజరంగి మంగళవారం అందుకునే పూజలో ఉన్న విశిష్టత గురించి చాలా మందికి తెలియదని పండితులు అంటున్నారు. సాధారణంగా హిందువులు రోజూ పూజలు చేసినప్పటికీ, మంగళవారం రాగానే ఆంజనేయస్వామి దేవాలయాలు భక్తులతో పోటెత్తుతాయి.
దీని వెనుక కేవలం నమ్మకం మాత్రమే కాదు, మన పురాణాలు, జ్యోతిష్య శాస్త్రాలు చెప్పిన గొప్ప ఆధ్యాత్మిక రహస్యాలు కూడా ఉన్నాయి. ఇక శాస్త్రాల ప్రకారం, అంజనాదేవి, కేసరుల తపస్సుకు మెచ్చి వాయుదేవుని అనుగ్రహంతో హనుమంతుడు జన్మించిన పవిత్రమైన రోజు ఈ మంగళవారమే అని చెబుతారు. అలాగే శ్రీరాముని కార్యసిద్ధి కోసం అవతరించిన ఆ మహావీరుడు భూమిపైకి అడుగుపెట్టిన రోజు కూడా మంగళవారం కావడం చేత, ఈ రోజు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు.
జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుడికి హనుమంతుడే అధిపతి. జాతకంలో కుజదోషం లేదా అంగారక దోషాలు ఉన్నవారు, మానసికంగా ధైర్యం లేక భయపడేవారు మంగళవారం నాడు ఆంజనేయుడిని ఉపాసిస్తే ఆ గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు పేర్కొంటాయి.. కుజుడు ధైర్యానికి, శౌర్యానికి ప్రతీక. ఆ గుణాలకు పరిపూర్ణ రూపమే హనుమంతుడు.. మరోవైపు సీతాదేవిని వెతుకుతూ లంకకు వెళ్లిన హనుమంతుడు, అశోకవనంలో అమ్మవారిని దర్శించి, రాముని ముద్రికను అందించిన రోజు కూడా మంగళవారమే అని రామాయణం చెబుతుంది.
అలాగే శ్రీరామునికి సుగ్రీవుడితో మైత్రి కుదిరిన రోజు, వానర సైన్యంతో సముద్రాన్ని దాటి లంకలో అడుగుపెట్టిన రోజు కూడా ఈ రోజే అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మంగళవారాన్ని కార్యసిద్ధి వారం అని కూడా పిలుస్తారు. ఈ రోజున హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేయడం, ఆంజనేయుడిని సిందూరంతో పూజించడం, వడమాల సమర్పించడం వల్ల నిత్యం ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోయి, అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతారు.. భయం, శని దోషాలు, మానసిక ఆందోళనలతో బాధపడేవారికి ఆంజనేయ స్వామి నిత్య రక్షకుడు. అందుకే మంగళవారం నాడు మంగళకరుడైన హనుమంతుడిని స్మరిస్తే జీవితంలో కూడా సమస్త మంగళాలే జరుగుతాయని భక్తుల విశ్వాసం..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.


