అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పవిత్రమైన రక్షాబంధన్ వెనుక ఎన్నో పురాణ కథలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు దాగి ఉన్నాయి. అందుకే రాఖీ పౌర్ణమి కేవలం వేడుక కాదు... అది జన్మజన్మల బంధానికి శ్రీరామరక్ష. కాలాలకు అతీతంగా, పురాణాల సాక్షిగా నిలిచిన సనాతన ధర్మ మహోన్నత సంప్రదాయం.. ఇక త్రేతాయుగానికి పూర్వమే కృతయుగంలో రాఖీ విశిష్టత కనిపిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
దేవతలకు, రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, రాక్షసరాజు ధాటికి దేవేంద్రుడు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాడు. ఆ సమయంలో ఇంద్రాణి (శచీదేవి) పరమశివుడి అనుగ్రహంతో ఒక పవిత్రమైన రక్షణ దారాన్ని పూజించి, దేవేంద్రుడి మణికట్టుకు కట్టింది. ఆ దివ్య రక్షాసూత్రం ఇచ్చిన బలంతోనే ఇంద్రుడు అసురులపై విజయం సాధించి తన రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నాడని ఇతిహాసం..
మరోవైపు బలి చక్రవర్తి భక్తికి మెచ్చిన శ్రీమహావిష్ణువు ఆయనకు ఇచ్చిన మాట కోసం వైకుంఠాన్ని వదిలి పాతాళంలో కాపలాదారుడిగా ఉండిపోయాడు. స్వామిని తిరిగి వైకుంఠానికి తీసుకెళ్లేందుకు లక్ష్మీదేవి ఒక శ్రావణ పౌర్ణమి నాడు సాధారణ స్త్రీ రూపంలో పాతాళానికి వెళ్లింది. బలి చక్రవర్తిని అన్నగా భావించి, ఆయన మణికట్టుకు పవిత్రమైన నూలుపోగును రక్షగా కట్టింది.
అనంతరం నేను నీకు చెల్లెలిని... నాకు ఏమిస్తావు? అని అడిగిన లక్ష్మీదేవికి, బలి చక్రవర్తి ఏం కావాలో కోరుకోమన్నాడు. లక్ష్మీదేవి తన నిజరూపాన్ని చూపి, ద్వారపాలకుడిగా ఉన్న శ్రీహరిని వైకుంఠానికి పంపమని కోరింది. తోబుట్టువు భావనకు కట్టుబడిన బలి చక్రవర్తి ఆనందంగా శ్రీమహావిష్ణువును పంపించివేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. మరోవైపు ద్వాపరయుగంలో శిశుపాలుడి సంహార సమయంలో శ్రీకృష్ణుడి వేలు తెగి రక్తం కారుతుంటే, ద్రౌపది క్షణం కూడా ఆలోచించకుండా తన పట్టుకోక కొంగును చింపి శ్రీకృష్ణుడి వేలికి కట్టింది.
ఆ చిన్న గుడ్డపేలికలోని నిస్వార్థమైన ప్రేమను స్వీకరించిన పరమాత్ముడు, అక్కా నీవు కట్టిన ఈ దారానికి ప్రతిగా నీకు ఏ కష్టం వచ్చినా కొండంత అభయమై నిలుస్తానని మాట ఇచ్చాడు శ్రీకృష్ణుడి.. అలా కౌరవ సభలో ద్రౌపదికి మానభంగం జరిగే ఘడియలో, అక్షయ వస్త్రాలను ప్రసాదించి ఆమెను కాపాడింది ఆ రక్షాబంధన మహిమే అని అంటారు.. అందుకే రక్షాబంధనం అంటే కేవలం అన్నచెల్లెళ్ల అనురాగం మాత్రమే కాదు..
కష్టాల్లో ఉన్న సోదరికి నేనున్నాననే అభయహస్తం. ఈ పవిత్రమైన దారం వెనుక బ్రహ్మతేజస్సు ఉంది, లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది, శ్రీకృష్ణుడి సుదర్శన చక్ర రక్షణ ఉంది. శ్రావణ పౌర్ణమి వేళ కట్టే ప్రతి రాఖీ మన ధర్మాన్ని, సంప్రదాయాలను చాటే ఒక పవిత్ర మాసం అని పండితులు పేర్కొంటారు..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.


