తెలంగాణ

Medak: కబ్జాల పై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్.. 22Aలోకి 522 ఎకరాల ఇనాం భూములు!..

రచన: Venu••8 నిమిషాల పఠనం

గతంలో అన్యాక్రాంతమైన ఇనాం భూములను తిరిగి ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మెదక్ జిల్లా శివ్వంపేట, నర్సాపూర్ మండలాల్లోని భూములపై అధికారులు దృష్టి సారించారు.

గతంలో ప్రభుత్వంలో అన్యాక్రాంతమైన ఇనాం భూములను తిరిగి ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మెదక్ జిల్లా శివ్వంపేట, నర్సాపూర్ మండలాల్లోని భూములపై అధికారులు దృష్టి సారించారు. శివ్వంపేట మండలం సికింద్లాపూర్‌లో సుమారు 400 ఎకరాలు, నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తిలో 122 ఎకరాల ఇనాం భూములకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా ఓఆర్సీలు, ఎన్ఓసీలు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ భూముల వ్యవహారంపై ప్రభుత్వం విచారణ చేపట్టి, వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

ఈ నేపథ్యంలో వందల కోట్ల విలువైన 522 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్టు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. అలాగే ఈ భూముల్లో వెంచర్లు కూడా ఏర్పాటు చేశారు. దీంతో భూములు కోల్పోయిన పేద రైతులు ఆందోళన చెందారు. తాజాగా ఈ భూములను నిషేధిత జాబితా 22ఏలో చేర్చడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ప్రాంతంలో ఎకరా భూమి రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ధర పలుకుతున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 22ఏ భూముల అంశం చర్చనీయాంశగా మారిన నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి ఈ బాగోతాన్ని బయటపెట్టారు. మరోవైపు బీఆర్‌‌ఎస్‌‌ హయాంలో ధరణి పోర్టల్‌‌లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని శివ్వంపేట మండలంలో వందలాది ఎకరాల ఇనాం భూములకు రెవెన్యూ అధికారులు ఎన్ఓసీలు జారీ చేసి పట్టాలు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి.

మరికొన్ని గ్రామాల్లో భూమి లేకున్నా రికార్డుల్లో విస్తీర్ణం పెంచి పట్టాలు ఇచ్చారు. సికింద్లాపూర్‌‌లోని సర్వే నంబర్లు 33 నుంచి 87 వరకు 1954–55 కాస్రా ప్రకారం దాదాపు 430 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. ఈ భూములను దస్తగర్ద్‌‌ గా నమోదు చేశారు. అయితే ఈ భూములపై హక్కులు కల్పించాలని కొందరు రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోగా, మరికొందరు కోర్టును ఆశ్రయించారు.

వీటిపై విచారణలు కొనసాగుతున్న సమయంలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పథకం ప్రకారం రెవెన్యూ అధికారులు ఇనాం రికార్డుల్లో భూముల విస్తీర్ణాన్ని తగ్గించి తమకు అనుకూలంగా ఉన్నవారికి కట్టబెట్టినట్టు ఆరోపణలున్నాయి. అలాగే నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారులకు ఓఆర్సీలు జారీ చేసి, ఒక్కొక్కరి పేరుపై 15, 20 ఎకరాల చొప్పున 400 ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్లు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి..

మరోవైపు అక్రమంగా భూములు పొందిన వ్యక్తులు సుమారు 200 ఎకరాల్లో భారీ వెంచర్‌‌ ఏర్పాటు చేస్తున్నామంటూ బ్రోచర్లు ముద్రించి ప్రచారం చేసుకున్నారు. ఈ క్రమంలో 2023లో కాంగ్రెస్‌‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సికింద్లాపూర్‌‌ భూములపై ఫిర్యాదులు రావడంతో వాటిని హోల్డ్‌‌లో పెట్టింది. దీంతో ఆ వెంచర్‌‌ లోపనులు ఆగిపోయాయి.. ఇక నర్సాపూర్‌‌ మండలం చిప్పల్‌‌తుర్తిలోని సర్వే నంబర్లు 58, 59లో సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అధికారులు గుర్తించారు.

కాగా బీఆర్‌‌ఎస్‌‌ హయాంలో ఇందులో నుండి దాదాపు 300 ఎకరాల భూములకు కూడా రెవెన్యూ అధికారులు అక్రమంగా ఎన్ఓసీలు జారీ చేసినట్టు తెలిసింది. ఇందులో 122 ఎకరాలకు ఫెన్సింగ్‌‌ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ భూమిలో కొంత భాగంలో భారీ రిసార్ట్‌‌ కూడా నిర్మించినట్టు తేలింది. ఇక నాడు వీధుల్లో ఉన్న అడిషనల్‌‌ కలెక్టర్‌‌ నగేశ్‌‌ చిప్పల్‌‌తుర్తిలో 112 ఎకరాలకు ఎన్ఓసీ జారీ చేసేందుకు ఎకరాకు రూ.లక్ష చొప్పున డిమాండ్‌‌ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.

కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌‌గా ఇచ్చిన తర్వాత, ఎన్ఓసీ జారీ చేయకపోవడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో అడిషనల్‌‌ కలెక్టర్‌‌ నగేశ్‌‌ను ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఈ కేసులో అప్పటి నర్సాపూర్‌‌ ఆర్డీఓ అరుణారెడ్డి తదితర రెవెన్యూ అధికారులపైనా కూడా కేసులు నమోదయ్యాయి. వారిని సస్పెండ్‌‌ చేశారు. అయితే ఇదంతా జరిగిన రెండేళ్ల తర్వాత అదే భూమికి ఎన్ఓసీలు జారీ కావడం ఆశ్చర్యాన్ని కలిస్తుంది.

మరోవైపు కాంగ్రెస్‌‌ అధికారంలోకి వచ్చాక తర్వాత మంత్రి దామోదర్‌‌ రాజనర్సింహను కలిసిన సికింద్లాపూర్‌‌ గ్రామస్తులు.. ఈ ఇనాం భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆ భూముల్లో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా ప్రభుత్వం హోల్డ్‌‌లో పెట్టింది. ఇటీవల వాటిని 22ఏ నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. అలాగే చిప్పల్‌‌తుర్తిలో అక్రమంగా ఎన్ఓసీలు జారీ చేసినట్టు ప్రభుత్వం దృష్టికి రావడంతో 122 ఎకరాలను సైతం 22ఏలో చేర్చారు.

ఈ రెండు ప్రాంతాల్లో కలిపి 522 ఎకరాల ప్రభుత్వ భూమిని దోచుకున్నారని అందుకే వాటిని 22ఏలో చేర్చినట్టు తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్‌‌ ద్వారా జరిగిన భూ లావాదేవీల డిజిటల్‌‌ రికార్డులు, అధికారుల లాగిన్‌‌ వివరాలపై దృష్టి సారించిన ప్రభుత్వం.. వీటిని పరిశీలించేందుకు సిట్‌‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇక ధరణి పోర్టల్ ప్రారంభించిన తర్వాత జరిగిన భూ లావాదేవీల్లో మార్పు, ఎన్ఓసీల జారీ, భూమి లేకున్నా పట్టాలు సృష్టించడం వంటి అంశాలపై సిట్​ విచారణ ప్రారంభించనుంది.

#telangana#Medak#Shivvampet#Narsapur#Congress#lands 522 acres#under Section 22A
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి