తెలంగాణ

TG : రూ.30 వేల కోట్ల విలువైన పాలిటెక్నిక్ భూములపై సీఎం రేవంత్ కన్ను?

రచన: Kumar•••5 నిమిషాల పఠనం

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘శక్తి’ స్కీంను పాలిటెక్నిక్ విద్యార్థులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. స్కిల్ వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీలను విలీనం చేయడంతో పాటు ఐటీఏలు, వివిధ టెక్నికల్ కోర్సులతో అనుసంధానించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘శక్తి’ స్కీంను పాలిటెక్నిక్ విద్యార్థులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. స్కిల్ వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీలను విలీనం చేయడంతో పాటు ఐటీఏలు, వివిధ టెక్నికల్ కోర్సులతో అనుసంధానించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇలా చేయడం వలన తమ భవిష్యత్ దెబ్బతింటుందని, పాలిటెక్నిక్ డిగ్రీలు ఉన్న తమను స్కిల్ వర్సిటీలో కలిపితే ఉద్యోగాలు రావని, శ్రామికుల్లా పనిచేయాల్సి వస్తుందని పాలిటెక్నిక్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు.

రూ.30 వేల కోట్ల విలువైన స్థలం

ఇదిలాఉండగా, ఉన్నపళంగా పాలిటెక్నిక్ కాలేజీల విలీనం వెనుక పెద్దకుట్ర కోణం ఉందని, రాష్ట్రవ్యాప్తంగా 60 పాలిటెక్నిక్ కాలేజీలు ఉండగా.. వాటికి చెందిన భూములును కాజేయాలని రేవంత్ సర్కార్ పన్నాగం పన్నిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాటి విలువ సుమారు రూ 30,000 కోట్ల ఉంటుందని అంచనా వేశాయి. అందుకే పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ వర్సిటీలో విలీనం చేయాలని కుట్రకు తెరలేపారని ప్రచారం జరుగుతోంది.1923లో నిజాం హయాంలో మాసబ్‌ట్యాంక్ వద్ద తొలి పాలిటెక్నిక్ కాలేజీ ప్రారంభం అవ్వగా.. ఇప్పుడు తెలంగాణలో సుమారు 60 పాలిటెక్నిక్ కాలేజీలు పేద, మధ్యతరగతి విద్యార్ధులకు ఉద్యోగకల్పనకు అవసరమైన వివిధ కోర్సులు చౌక ధరలో అందిస్తున్నాయి.

స్కిల్ వర్సిటీ ఫెయిల్!

ఇంజినీరింగ్  చేసిన విద్యార్ధుల కన్నా ఎక్కువగా పాలిటెక్నిక్ కోర్సులు చేసిన విద్యార్ధులకే తొందరగా ఉద్యోగాలు వస్తుండటం ఆ కాలేజీలు,కోర్సులు ఎంత అవసరమో నిరూపిస్తున్నాయి. అయితే, రూ.వందల కోట్లు ఖర్చు చేసి ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన స్కిల్ యూనివర్సిటీ పెద్దగా ఆదరణ లభించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న వేళ.. పాలిటెక్నిక్ కాలేజీలకు ఉన్న రూ.వేల కోట్ల భూమి మీద రేవంత్ కన్ను పడిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

ఉదాహరణకు మాసబ్‌ట్యాంక్‌లోని పాలిటెక్నిక్ కాలేజీకి నగరం నడిబొడ్డున రూ.వేల కోట్లు విలువచేసే భూమి ఉంది.అలాగే, సికిందరాబాద్ పాలిటెక్నిక్ కాలేజీకి కూడా సుమారు అదే స్థాయిలో విలువైన 10 ఎకరాల భూమి ఉంది. వరంగల్, నిజామాబాద్, నల్లగొండ ఇలా ప్రతి పెద్ద పట్టణంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీకి రూ.వందల కోట్ల విలువ చేసే భూమి ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్నట్టు సమాచారం.అందుకే రేవంత్ కన్ను ఈ విలువైన భూముల మీద పడిందని పాలిటెక్నిక్ విద్యార్ధులు సైతం ఆరోపిస్తున్నారు.

 హెచ్‌సీయూ తర్వాత ఉర్దూ వర్సిటీ ల్యాండ్స్

తొలుత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమి, ఆ తర్వాత మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల విలువైన భూమిని అమ్ముకోవాలని రేవంత్ సర్కార్ ప్రయత్నించగా..విద్యార్థుల ఆందోళనల వలన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. తాజాగా పాలిటెక్నిక్ కాలేజీ భూముల మీద రేవంత్ రెడ్డి కన్ను పడిందని, అందుకే విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న వెనక్కి తగ్గడం లేదని పెద్దఎత్తున ఆరోపణలు,విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

#cm revanth reddy#polytechnic colleges#lands#telangana
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి