ఒక రాఖీ యాడ్.. ఓ నటి దుస్తులు.. ఒక సోషల్ మీడియా పోస్ట్.. చివరికి పొలిటికల్ వార్! నటి కృతి సనన్ నటించిన రక్షాబంధన్ ప్రకటన చుట్టూ మొదలైన వివాదం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని దాటి రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కృతి సనన్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతుగా నిలవడం.. ఆయన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడంతో ఈ వ్యవహారం మరింత హాట్‌గా మారింది.
అసలు వివాదానికి కారణం ఏంటి?
రక్షాబంధన్ సందర్భంగా ఓ నగల బ్రాండ్ రూపొందించిన 32 సెకండ్ల ప్రకటనలో కృతి సనన్ కనిపించారు. తన సోదరుడికి రాఖీ కట్టడంతో పాటు.. పెంపుడు కుక్కకు కూడా రాఖీ కట్టే సన్నివేశం ఇందులో ఉంది. కృతి ధరించిన ఆధునిక దుస్తులపై సోషల్ మీడియాలో కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సంప్రదాయ పండుగను చూపించే యాడ్‌లో ఇలాంటి వస్త్రధారణ అవసరమా? అంటూ విమర్శలు మొదలయ్యాయి.
ఈ విమర్శలపై కంగనా రనౌత్ కూడా స్పందించారు. రక్షాబంధన్ వంటి సంప్రదాయ పండుగ సందర్భంగా కృతి ధరించిన దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ప్రకటనను తీవ్రంగా విమర్శించారు. దీంతో వ్యవహారం కృతి వర్సెస్ కంగనా అన్నట్టుగా మారింది.
కృతి కౌంటర్...
అయితే కృతి కూడా వెనక్కి తగ్గలేదు. ఒక మహిళ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తుందా లేదా అనేది ఆమె వేసుకునే దుస్తులతో ఎలా నిర్ణయిస్తారు? అంటూ ప్రశ్నించారు. పండుగల అసలు అర్థం దుస్తుల్లో లేదని.. వాటి వెనుక ఉన్న ప్రేమ, అనుబంధం, విలువల్లో ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. మహిళలు ఏం ధరించాలో చెప్పడం ఎప్పుడు ఆపుతారని ప్రశ్నిస్తూ తన వాదనను గట్టిగానే వినిపించారు.
రక్షాబంధన్ భావనపైనా కృతి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాఖీ అంటే కేవలం సోదరుడు తన సోదరిని రక్షించడమే కాదని.. సోదరసోదరీమణులు పరస్పరం ప్రేమ, రక్షణకు ప్రతీకగా రాఖీ కట్టుకోవచ్చని చెప్పారు. పెంపుడు కుక్కకు రాఖీ కట్టడాన్ని కూడా ఇదే భావనలో చూడాలని ఆమె వివరించారు.
రాహుల్ ఎంట్రీతో పొలిటికల్ కలర్...
ఇక్కడే ఈ వివాదంలోకి రాహుల్ గాంధీ ఎంటరయ్యారు. కృతి స్పందనను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన రాహుల్.. మహిళలు ఏం ధరించాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది వారి వ్యక్తిగత ఎంపిక అని వ్యాఖ్యానించారు. మహిళలు తమ స్వేచ్ఛను ఉపయోగిస్తున్నందుకు వారిని ట్రోల్ చేయడం ఆపాలని అన్నారు. దీనికి తోడు “Smash the Patriarchy” అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జోడించారు.
రాహుల్ వ్యాఖ్యతో ఈ వివాదానికి ఒక్కసారిగా రాజకీయ రంగు వచ్చింది. ఎందుకంటే ఇప్పటివరకు ఇది ఒక సినిమా నటి, ఒక ప్రకటన, సోషల్ మీడియా విమర్శలకు పరిమితమైన వ్యవహారం. కానీ రాహుల్ ఎంట్రీతో మహిళా స్వేచ్ఛ, పితృస్వామ్యం, సంప్రదాయాలు వంటి అంశాలపై రాజకీయ చర్చ మొదలైంది.
ఇక రాహుల్ వ్యాఖ్యలకు కంగనా రనౌత్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు మరో చర్చకు కారణమైంది. “బ్రో.. కాస్త ఆగండి. భారత్ మాతా కీ జై.. ప్రారంభిద్దాం” అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘మాతా’ అనే పదాన్ని హైలైట్ చేస్తూ రాహుల్ వ్యాఖ్యలకు వ్యంగ్యంగా సమాధానం ఇచ్చినట్టుగా కనిపించింది.
అంతేకాదు.. రాహుల్ గాంధీతో ఓ యువతి సంభాషిస్తున్నట్టుగా ఉన్న చిత్రాలను షేర్ చేస్తూ.. ట్రిపుల్ తలాక్, మహిళా బిల్లు వంటి అంశాల్లో కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నించేలా కంగనా తన పోస్టుల్లో వ్యాఖ్యలు చేశారు. దీంతో కృతి సనన్ యాడ్ వివాదం ఇప్పుడు రాహుల్ వర్సెస్ కంగనా రాజకీయ మాటల యుద్ధంగా మారిపోయింది.
ఒక యాడ్‌లో నటి వేసుకున్న దుస్తులపై మొదలైన ప్రశ్న.. చివరకు మహిళలకు వ్యక్తిగత స్వేచ్ఛ ఎంత? సంప్రదాయాలకు ప్రాధాన్యం ఎంత? అనే పెద్ద చర్చగా మారింది. ఒకవైపు మహిళ ఏం ధరించాలో నిర్ణయించే హక్కు ఎవరికీ లేదనే వాదన.. మరోవైపు సంప్రదాయ పండుగలకు ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక విలువ ఉంటుందనే వాదన.. ఈ రెండు కోణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఢీకొంటున్నాయి.
అందుకే ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా? లేక కృతి సనన్ యాడ్ పేరుతో మొదలైన ఈ చర్చ మరింత పెద్ద రాజకీయ వివాదంగా మారుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
రాఖీ యాడ్ మొదలుపెట్టిన రచ్చ.. రాహుల్ ఎంట్రీతో పొలిటికల్ టర్న్ తీసుకుంది. కంగనా కౌంటర్‌తో మరింత హీట్ పెరిగింది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వార్ ఎక్కడి వరకు వెళ్తుందన్నదే అసలు ఆసక్తి!


