వరంగల్ ఎంజీఎంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే రోగులు చుక్కలు చూస్తున్నారు. మెరుగైన వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు సైతం సమయానికి అక్కడ ఉండటం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్‌కు వచ్చిన రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులు వచ్చేంత వరకు వేచిచూడాల్సి వస్తోందని సమాచారం. డ్యూటీ డాక్టర్లు తక్కువగా ఉండటంతో రౌండ్స్‌కు వెళ్లి వచ్చేవరకు ఇతర రోగులు వేచి చూడాల్సి వస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సిబ్బంది కొరత కూడా వరంగల్‌లోని మహాత్మా గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి దుస్థితిని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది.దీంతో ఉన్నవారికి అదనపు పనిగంటలు డ్యూటీ వేయడంతో వారు కూడా ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. ఫలితంగా ఆస్పత్రి వాతావరణం మారిపోతుందని, సిబ్బంది ఆలసి పోవడం, చిరాకపడుతున్నట్టు కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. ఎంతో మంది పేదలకు ఉచిత వైద్యం అందించే ఎంజీఎం ఆస్పత్రిని పట్టించుకోవాలని రోగులు, వారి తరపు బంధువులు సైతం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
https://x.com/TeluguScribe/status/2092456741636280402?s=20
ఇదిలాఉండగా, వీల్ చైర్ లేదని ఓ రోగిని తన కుటుంబసభ్యులు భుజాల మీద మోసుకుని ఆస్పత్రి లోనికి తీసుకొచ్చారు. రోగిని ‘ఎక్స్‌రే’కు తీసుకెళ్లేందుకు వీల్‌చైర్ లేకపోవడంతో ఇలా చేయాల్సివచ్చిందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఇక్కడ ఆస్పత్రికి సిబ్బంది నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది.నడవలేని పరిస్థితిలో ఉన్న రోగికి వీల్ చైర్ అందించాల్సిన సిబ్బంది పట్టించుకోలేదని కూడా సమాచారం.వరుస ఘటనలు వెలుగులోకి వస్తున్నా వైద్యశాఖ మొద్దు నిద్ర వీడటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇది ఆసుపత్రి కాదు నరకకూపం అని, రోగులకు కనీస వసతులు కల్పించలేని ప్రభుత్వం ఎందుకని ప్రజలు మండిపడుతున్నారు.


