తెలంగాణ

Telangana: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త!..

రచన: Venu•••4 నిమిషాల పఠనం

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తీపి కబురు చెప్పింది. నిధుల కొరతతో కొంతకాలంగా నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాల చివరి విడత బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తీపి కబురు చెప్పింది. నిధుల కొరతతో కొంతకాలంగా నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాల చివరి విడత బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్చి నెల వరకు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్న దాదాపు 16 వేల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా.. మొత్తం 185 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పీఎంఏవై నిధులు ఆలస్యం కావడంతో.. తుది బిల్లుల చెల్లింపుల్లో జాప్యం ఏర్పడింది..

ఈ క్రమంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో.. రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులను సర్దుబాటు చేసి ఈ 185 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ నిధుల్లో భాగంగా ఒక్కో లబ్ధిదారుడికి చివరి విడత కింద ఒక లక్ష రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి డీబీటీ ద్వారా జమ చేయనున్నారు. ఇక ఇల్లు పూర్తిచేసుకున్న లబ్ధిదారులకు పెండింగ్‌లో ఉన్న చివరి విడత బిల్లు అందడంతో.. నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక భారం కొంత మేర తగ్గనుంది..

ఇప్పటికే ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిధులను విడతల వారీగా భారీగా విడుదల చేస్తోంది. 2025 సెప్టెంబర్ నాటికే సుమారు లక్షన్నర ఇళ్లకు 1,612 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత కూడా చెల్లింపులు కొనసాగాయి. 2026 జనవరిలో సుమారు 23 వేల మంది లబ్ధిదారులకు 262 కోట్ల 51 లక్షల రూపాయలు విడుదలయ్యాయి. మార్చిలో మరో 2,764 మంది లబ్ధిదారులకు 28 కోట్ల 50 లక్షల రూపాయల పెండింగ్ బిల్లులు క్లియర్ చేశామని పేర్కొన్నారు..

ఇలా గతంలో విడుదలైన నిధులతో పాటు తాజాగా విడుదల చేసిన 185 కోట్ల రూపాయలను కలిపితే.. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం విడతల వారీగా దాదాపు రూ. 700 కోట్లకు పైగా నిధులను విడుదల చేసిందని సమాచారం. ఇక నాలుగు విడతల్లో మొత్తం 4.5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, ఇందుకోసం మొత్తం రూ. 22,000 కోట్ల బడ్జెట్ వ్యయాన్ని అంచనా వేసింది.

మరోవైపు 2026 మార్చి నాటికి రాష్ట్రంలో 3 లక్షల 24 వేల 536 ఇళ్లకు ప్రభుత్వం మంజూరు ఇవ్వగా.. 2 లక్షల 62 వేల 449 ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రతి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందుతోంది. అలాగే ఇప్పుడు విడుదల చేసిన 185 కోట్ల రూపాయలతో.. ఇప్పటికే ఇల్లు పూర్తిచేసుకున్న వేలాది మంది లబ్ధిదారుల కల నిజమవ్వనుంది.

#Telangana#Housing Scheme#Indiramma Indlu#DBT Fund#Transfer#congress
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి