బీజేపీలో గడ్కరీ వ్యాఖ్యల కలకలం
యువతకు అవకాశం ఇవ్వాలంటూ కామెంట్స్
గడ్కరీ టార్గెట్ ఎవరు..?
మోదీ చుట్టూ తిరుగుతున్న చర్చ
ఇంకా మనమేనా? యువతకు అవకాశం ఎప్పుడు ఇవ్వాలి? కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నోటి నుంచి వచ్చిన ఈ ఒక్క ప్రశ్న ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది కేవలం ఓ కార్యక్రమంలో చేసిన సాధారణ వ్యాఖ్యలేనా? లేక బీజేపీ భవిష్యత్ నాయకత్వంపై గడ్కరీ వేసిన పొలిటికల్ పంచా? అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా 2029లోనూ మోదీనే ప్రధానిగా కొనసాగాలంటూ బీజేపీ నేతలు మాట్లాడుతున్న సమయంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఎవరిని టార్గెట్ చేశారు..?
గడ్కరీ మాటలు పైకి చూస్తే మాత్రం తన గురించే అన్నట్టుగా కనిపిస్తున్నాయి. 30 ఏళ్లకు పైగా రాజకీయ పదవుల్లో ఉన్నాను.. ఇంకా వీటిని పట్టుకుని వేలాడటం ఎందుకు? యువతకు అవకాశం ఇవ్వాలి.. నేను తప్పుకునే సమయం వచ్చిందన్నది ఆయన మాటల సారాంశం. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. రాజకీయాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న నాయకుడు యువతకు దారి ఇవ్వాలి అని చెప్పినప్పుడు.. అది కేవలం తనకే వర్తిస్తుందా? లేక తనతోపాటు మరికొందరికి కూడా వర్తిస్తుందా?
జాతీయస్థాయిలో ఆసక్తికర చర్చ
కొద్ది రోజులుగా బీజేపీలో 2029 రాజకీయాలపై చర్చ నడుస్తోంది. 2029లోనూ నరేంద్ర మోదీనే ప్రధానిగా కొనసాగాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బహిరంగంగా చెప్పారు. మోదీతో పాటు మరికొందరు సీనియర్ మంత్రులు కూడా కొనసాగాలని ఆయన తన మనసులో మాటను బయటపెట్టారు. సరిగ్గా ఈ సమయంలో గడ్కరీ “ఇంకా మనమేనా?” అని ప్రశ్నించారు.
ఇది యాదృచ్ఛికమా? లేక గడ్కరీకి టైమింగ్ తెలుసా? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఎందుకంటే గడ్కరీ ఆషామాషీ లీడరేం కాదు. పైగా సంఘ్‌తో ఆయనకున్న అనుబంధం చాలా విలువైంది. ఆయన నోటి నుంచి ఏదైనా మాట వస్తే.. ఆరెస్సెస్ నుంచే వచ్చిందని భావిస్తుంటారు. అందుకే ఆయన చేసిన కామెంట్స్ జాతీయస్థాయిలో కాక రేపుతున్నాయి.
ఇక మోదీ రాజకీయ ప్రస్థానం ఇప్పటికే దాదాపు 27 ఏళ్లకు చేరింది. ముఖ్యమంత్రిగా మొదలై ప్రధానిగా కొనసాగుతున్న ఆయన 2029లో మళ్లీ అధికారంలోకి వస్తే.. రాజకీయంగా మరో దశలోకి వెళ్తారు. అదే సమయంలో బీజేపీ తదుపరి తరం నాయకత్వం ఎప్పుడు ముందుకు రావాలి అనే ప్రశ్న కూడా తప్పకుండా ఎదురవుతుంది.
పొలిటికల్ గేమ్..!
మరి.. గడ్కరీకి ఈ విషయం తెలియదా? తెలుసు. అయితే ఆయన ఏం చేశారు? ఎవరినీ పేరు పెట్టి విమర్శించలేదు. ఎవరినీ టార్గెట్ చేయలేదు. కానీ ఒక ప్రశ్న మాత్రం వేశారు. యువతకు అవకాశం ఎప్పుడు? ఇదే గడ్కరీ స్టైల్ ప్రశ్న. దీనిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.
నేరుగా చెప్పకుండా.. చెప్పాల్సిన మాట చెప్పడం. వ్యక్తిని టార్గెట్ చేయకుండా.. ఒక సూత్రాన్ని ముందుకు పెట్టడం. తన గురించి మాట్లాడుతున్నట్టే కనిపిస్తూ.. పెద్ద రాజకీయ ప్రశ్నను తెరపైకి తీసుకురావడం. అందుకే కొందరు దీన్ని గడ్కరీ “స్మార్ట్ పొలిటికల్ గేమ్”గా అభివర్ణిస్తున్నారు.
అయితే మరో వాదన కూడా ఉంది. గడ్కరీ నిజంగానే రాజకీయ పదవులపై ఆసక్తి తగ్గించుకుంటున్నారా? 30 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న తర్వాత.. ఇక పదవుల కంటే రైతులు, గ్రామాలు, గిరిజన ప్రాంతాల సమస్యలపై పనిచేయాలని ఆయన భావిస్తున్నారా? అదే నిజమైతే.. ఇది మోదీకి వ్యతిరేకమైన వ్యాఖ్య కాదని కూడా చెప్పొచ్చు.
కానీ సమస్య ఏమిటంటే.. గడ్కరీ మాట్లాడిన మాటలు మాత్రం జాతీయ రాజకీయాల్లో వేరే అర్థాన్ని తీసుకుంటున్నాయి. ఎందుకంటే గడ్కరీకి బీజేపీ సంస్థాగత వ్యవస్థపై లోతైన అవగాహన ఉంది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కేంద్రంలో కీలక మంత్రిగా కొనసాగుతున్నారు. అలాంటి నాయకుడు.. కొత్త తరాలకు అవకాశం ఇవ్వాలి అంటే.. పార్టీ భవిష్యత్తుపై చర్చ జరగడం సహజమే.
ఇప్పుడు మరో ప్రశ్న. బీజేపీకి నిజంగానే జనరేషన్ చేంజ్ అవసరమా? మోదీ తర్వాత ఎవరు? అమిత్ షా తర్వాత పార్టీ రాజకీయ దిశ ఎలా ఉంటుంది? యువ నాయకులకు ఎప్పుడు పూర్తి స్థాయి బాధ్యతలు వస్తాయి? ముఖ్యంగా 2029 ఎన్నికల తర్వాత బీజేపీ నాయకత్వం ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నలకు గడ్కరీ సమాధానం చెప్పలేదు. కానీ ఆయన చేసిన ఒక్క వ్యాఖ్య మాత్రం ఈ ప్రశ్నలన్నింటినీ మళ్లీ బయటకు తీసుకొచ్చింది.
చర్చ ఎందుకు ఆగడం లేదు?
రాజకీయాల్లో మాట కంటే టైమింగ్ ముఖ్యం. 2029పై చర్చ మొదలైన సమయంలోనే.. “ఇంకా మనమేనా?” అనే ప్రశ్న రావడం.. యువతకు అవకాశం ఇవ్వాలి అని చెప్పడం.. నేను తప్పుకునే సమయం వచ్చింది అని ప్రకటించడం.. ఇవన్నీ కలిపి చూస్తే.. గడ్కరీ మాటలకు సాధారణ వ్యాఖ్యలకంటే ఎక్కువ పొలిటికల్ వెయిట్ కనిపిస్తోంది.
బహుశా గడ్కరీ నిజంగానే తన గురించి మాట్లాడి ఉండొచ్చు. మరెవరి గురించో ఆలోచిస్తూ కూడా ఉండొచ్చు. లేదా.. బీజేపీ రాజకీయాల్లో రాబోయే తరాల మార్పును ముందుగానే గుర్తు చేస్తున్నారేమో! అందుకే ఇప్పుడు దేశ రాజకీయాల్లో అసలు చర్చ గడ్కరీ పదవి నుంచి తప్పుకుంటారా? అన్నది కాదు. గడ్కరీ మాటల్లో దాగి ఉన్న మెసేజ్ ఏంటి? అదే అసలు ప్రశ్న.
ఆయన గేమ్ ఆడుతున్నారా? లేక బీజేపీ నెక్స్ట్ జనరేషన్ గేమ్‌ను ముందుగానే బయటపెడుతున్నారా? 2029 దగ్గరపడే కొద్దీ.. ఈ ఒక్క ప్రశ్నే మరింత పెద్దదయ్యే అవకాశం ఉంది.


