తెలంగాణ

మరో ఎన్నికల నగారా.. గ్రేటర్ వార్‌కు ప్రభుత్వం సిద్ధమవుతోందా?

రచన: Kashi••9 నిమిషాల పఠనం

హైదరాబాద్‌ ఎన్నికలు అధికార కాంగ్రెస్‌కు కీలక పరీక్షగా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నగర రాజకీయాల్లో తన బలాన్ని పెంచుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. గ్రేటర్‌ పరిధిలో బీఆర్‌ఎస్‌ బలమైన రాజకీయ పునాది ఏర్పాటు చేసుకుంది. బీజేపీ కూడా హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లో బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉంది.

గ్రేట‌ర్ వార్‌కు సై అంటున్న స‌ర్కారు

తెలంగాణ‌లో మ‌రింత వేడెక్క‌నున్న రాజ‌కీయాలు

ఎన్నిక‌ల మూడ్‌లోకి ప్ర‌ధాన పార్టీలు

తెలంగాణలో మరోసారి ఎన్నికల వేడి మొదలుకాబోతోందా..? ఇప్పటికే రాజకీయంగా హాట్‌హాట్‌గా మారిన రాష్ట్రంలో మరో ఎన్నికల నగారా మోగనుందా..? పరిస్థితులు చూస్తుంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. డిసెంబరులో గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు కొత్తగా ఏర్పడిన సైబరాబాద్‌, మల్కాజిగిరి కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే తెలంగాణలో మరోసారి ఎన్నికల సీజన్‌ మొదలైనట్టే.

ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్‌లో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు.. ఇలా వరుసగా ఎన్నికలను ఎదుర్కొన్న తెలంగాణ ఇప్పుడు మరో కీలక పోరుకు రంగం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఈసారి పోటీ గ్రామీణ ప్రాంతాల్లో కాదు.. రాష్ట్ర రాజకీయాలపై అత్యంత ప్రభావం చూపించే హైదరాబాద్‌ నగరంతో పాటు దాని శివారు ప్రాంతాల్లో జరగబోతోంది. అందుకే రానున్న ఎన్నికలను సాధారణ ఎన్నికలుగా కాకుండా ‘గ్రేటర్ వార్‌’గా రాజకీయ వర్గాలు చూస్తున్నాయి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘సర్‌’ ప్రక్రియ అక్టోబర్‌ 19తో పూర్తయ్యే అవకాశం ఉండటంతో ఆ తర్వాత కొంత సమయం తీసుకుని డిసెంబరులో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పురపాలకశాఖ కూడా ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి సారించినట్లు సమాచారం. అంటే ఇప్పటి నుంచే ఎన్నికల యంత్రాంగం కదలడం మొదలుపెట్టిందన్నమాట.

హైద‌రాబాద్ చుట్టే రాజ‌కీయం

ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారడానికి ప్రధాన కారణం హైదరాబాద్‌ పరిధిలో జరిగిన పునర్‌వ్యవస్థీకరణ. గతంలో గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఒక్కటే ఉండేది. ఇప్పుడు హైదరాబాద్‌ను కొనసాగిస్తూనే శివారు ప్రాంతాలను కలుపుతూ మల్కాజిగిరి, సైబరాబాద్‌ పేరుతో మరో రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. పోలీస్‌ కమిషనరేట్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధులు ఒకేలా ఉండేలా ఈ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టారు. దీంతో ఈ మూడు కార్పొరేషన్లకు జరిగే ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి.

ముఖ్యంగా హైదరాబాద్‌ ఎన్నికలు అధికార కాంగ్రెస్‌కు కీలక పరీక్షగా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నగర రాజకీయాల్లో తన బలాన్ని పెంచుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. గ్రేటర్‌ పరిధిలో గతంలో బీఆర్‌ఎస్‌ బలమైన రాజకీయ పునాది ఏర్పాటు చేసుకుంది. మరోవైపు బీజేపీ కూడా హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లో తన బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.

గ్రేట‌ర్‌తో పాటు మ‌రికొన్ని చోట్ల‌...

ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. అయితే జీహెచ్‌ఎంసీతో పాటు వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లకు అప్పట్లో ఎన్నికలు జరగలేదు. అదే సమయంలో మందమర్రి, మణుగూరు, అచ్చంపేట, నకిరేకల్‌, కొత్తూరు, సిద్దిపేట మున్సిపాలిటీల్లో కూడా వివిధ కారణాలతో ఎన్నికల ప్రక్రియ పూర్తికాలేదు. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరి 10న జీహెచ్‌ఎంసీ పాలకవర్గం కాలపరిమితి ముగిసింది. సాధారణంగా ఆ తర్వాత ఆరు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ.. కార్పొరేషన్‌ పునర్‌వ్యవస్థీకరణ కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఆ ప్రక్రియ పూర్తవుతుండటంతో ఎన్నికలకు మార్గం సుగమమవుతున్నట్లు కనిపిస్తోంది. అంటే కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లకు ప్రజల తీర్పు తీసుకునే సమయం దగ్గరపడుతోందన్నమాట.

డిసెంబ‌రే ఎందుకు..?

డిసెంబరునే ప్రభుత్వం ఎందుకు ఎంచుకుంటోంది అన్నదీ ఆసక్తికరమైన ప్రశ్న. ప్రస్తుతం అధికారులు ‘సర్‌’ ప్రక్రియలో బిజీగా ఉన్నారు. అక్టోబర్‌ 19 తర్వాత వారికి కొంత సమయం ఇవ్వాలి. అదే సమయంలో వర్షాకాలం కూడా ముగిసి వాతావరణం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. తాగునీరు, విద్యుత్‌ వంటి సమస్యలు కూడా కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ప్రజలను ఎన్నికలకు సిద్ధం చేయడానికి, పరిపాలనా ఏర్పాట్లు పూర్తి చేయడానికి కూడా ప్రభుత్వానికి సమయం దొరుకుతుంది. ఈ లెక్కలన్నింటినీ చూసే డిసెంబరులో ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

కానీ అసలు రాజకీయ పరీక్ష మాత్రం పార్టీలకే. హైదరాబాద్‌ అంటే కేవలం ఒక నగరం కాదు.. తెలంగాణ రాజకీయాలకు దిశానిర్దేశం చేసే ప్రాంతం. ఇక్కడి ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన సైబరాబాద్‌, మల్కాజిగిరి కార్పొరేషన్లలో ఎవరు ఆధిపత్యం సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారనుంది. శివారు ప్రాంతాల్లో విస్తరిస్తున్న జనాభా, కొత్త ఓటర్లు, మధ్యతరగతి ఓటర్లు, ఐటీ ఉద్యోగులు, వ్యాపార వర్గాలు.. ఇలా విభిన్న వర్గాల తీర్పు ఈ ఎన్నికల్లో కీలకం కానుంది.

అందుకే డిసెంబరు ఎన్నికలు కేవలం మున్సిపల్‌ ఎన్నికలుగా క‌నిపించ‌డం లేదు. రాష్ట్రంలో అధికార పార్టీ బలం ఎంత? ప్రతిపక్షాల పట్టు ఎంత? నగర ఓటర్లు ఎటువైపు ఉన్నారు? కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లలో ప్రజల మూడ్‌ ఎలా ఉంది? అనే ప్రశ్నలకు ఈ ఎన్నికలు సమాధానం చెప్పే అవకాశం ఉంది. ప్ర‌ధానంగా హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి వంటి కీలక ప్రాంతాలు ఉండటంతో ఈసారి ఎన్నికల వేడి మరింత పెర‌గ‌వ‌చ్చు.

#Telangana Politics#Greater Hyderabad Elections#GHMC Elections#Cyberabad Elections#Malkajgiri Elections#Telangana Elections#Congress#BRS#BJP#Revanth Reddy#Hyderabad Politics#Municipal Elections
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి