DK Aruna: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజల దృష్టిని మరల్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. మంగళవారం మహబూబ్ నగర్ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు.
బీమా ప్రీమియం చెల్లింపుల్లో నిర్లక్ష్యం
రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థులకు 15వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు చెల్లించకపోవడం వల్ల పిల్లల తల్లులు వారి భవిష్యత్తు కోసం పుస్తెలు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రైతు బీమా పథకం ఈ నెల 13తో ముగిసిందన్నారు. బీమా ప్రీమియం చెల్లింపులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఫసల్ బీమా పథకాన్ని సైతం రాష్ట్రం అమలు చేయడం లేదని ఎంపీ అరుణ ఆరోపించారు.
ఒక్క ప్రాజెక్ట్ పనులు కూడా పూర్తి చేయలేదు
విద్యాశాఖను తన దగ్గరే ఉంచుకున్న సీఎం రేవంత్.. నాణ్యమైన విద్యను ఎందుకు అందించలేకపోతున్నారు? విద్యార్థుల సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? ప్రతి మూడు నెలలకోసారి పాలమూరు రంగారెడ్డి పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్షలు పెట్టి హడావిడి చేయడం తప్ప ఇంతవరకు ఒక్క ప్రాజెక్టు పనులను కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవు. దేశంలో ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. ఇందులో భాగంగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రాలేదు. ఈ ప్రాజెక్టు పూర్తి కోసం ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. అందుకు పాలమూరు రంగారెడ్డి మొదటి డీపీఆర్ ను రివైజ్ చేయాలి.
అందుకే డైవర్షన్ పాలిటిక్స్
ఆర్డీఎస్ కు ఇంతవరకు నీళ్లు విడుదల చేయలేదు. గట్టు, గూడెం దొడ్డి, ర్యాలంపాడు రిజర్వాయర్ కెపాసిటీ పెంచుతామని ప్రభుత్వం అంటోంది. మరి వీటిని ఎంత కాలంలో పూర్తి చేస్తారు? కమీషన్ల కోసమే రిజర్వాయర్ల కెపాసిటీ పెంచుతున్నారు. ఈ ప్రాజెక్టుల పరిస్థితులను పరిశీలించేందుకు మీడియాతో కలిసి త్వరలో పరిశీలిస్తాను. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న వర్గ విబేధాలను పక్కదారి పట్టించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కు తెర లేపారు'' అని డీకే అరుణ ఆరోపించారు.












