తెలంగాణ

Telangana: పేదల సొంతింటి కలను నిజం చేయనున్న ఇందిరమ్మ టవర్స్‌.. 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో పూర్తి అయిన టెండ‌ర్ ప్ర‌క్రియ!..

రచన: Venu••6 నిమిషాల పఠనం

క్యూఆర్‌ పరిధిలో తొలి విడతగా 16 నియోజకవర్గాల్లో 807 కోట్ల 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మిస్తున్నారు. ఇందుకోసం జూన్‌ 20 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తులు స్వీకరించిన క్రమంలో మొత్తం 60 వేల 720 దరఖాస్తులు వచ్చాయి...

హైదరాబాద్‌ నగర పరిధిలో సొంతింటి కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబాల కలలను నిజం చేసే దిశగా ప్రజా ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకు వేసింది. పేదవాళ్ళకి కూడా నగరంలో సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణ కార్యక్రమాన్ని వేగవంతం చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

క్యూఆర్‌ పరిధిలో తొలి విడతగా 16 నియోజకవర్గాల్లో 807 కోట్ల 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మిస్తున్నారు. ఇందుకోసం జూన్‌ 20 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తులు స్వీకరించిన క్రమంలో మొత్తం 60 వేల 720 దరఖాస్తులు వచ్చాయి... ఇక క్షేత్రస్థాయి పరిశీలన, సమగ్ర విచారణ అనంతరం 40 వేల 900 మందిని అర్హులుగా, 19 వేల 820 మందిని అనర్హులుగా గుర్తించారు.

అయితే ఈ అనర్హతకు గల కారణాలను దరఖాస్తుల వారీగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అలాగే అర్హులైన దరఖాస్తుదారుల సమక్షంలో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి కేంద్రానికి ప్రత్యేక పర్యవేక్షణాధికారిని నియమించడంతో పాటు.. లక్కీ డ్రాలో ఎంపిక కాని వారికి, వారు చెల్లించిన 10 వేల రూపాయలను బ్యాంకు ఖాతాల్లోకి తిరిగి జమ చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. .

మరోవైపు ఆగస్టు 27న రాయదుర్గం, కేపీహెచ్‌బీ కాలనీ, మైలార్‌దేవరపల్లి, రెడ్‌హిల్స్‌లో.. 28న కౌకూర్‌, పాటిగెడ్డ, జల్‌పల్లి, కుల్సుంపురలో.. 29న జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీ, బోయిన్‌పల్లి, బండ్లగూడ ఎల్‌ఐజీ కాలనీ, నందిముసలిగూడలో.. 30న గాజులరామారం, అంబర్‌పేట సిటీ పోలీస్‌ లైన్స్‌, గడ్డిఅన్నారం, ఆర్‌అండ్‌బీ క్వార్టర్స్‌, పోచారం ఎల్‌ఐజీ కాలనీలో లక్కీ డ్రా నిర్వహించనున్నారు.

ఇదే సమయంలో మరో నాలుగు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేశారు. ఎల్‌బీనగర్‌, గోషామహల్‌, ముషీరాబాద్‌, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో ఒక్కో చోట 480 చొప్పున మొత్తం 1,920 ఇళ్లను నిర్మించనున్నారు. ఈ నాలుగు నియోజకవర్గాల పరిధిలోని అర్హులు సెప్టెంబర్‌ 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు.

ఇందిరమ్మ టవర్స్‌ అంటే కేవలం ఒక అపార్ట్‌మెంట్‌లో ఇల్లు ఇవ్వడం మాత్రమే కాదు.. నగరంలో పేద కుటుంబం ఆత్మగౌరవంతో జీవించే అవకాశం కల్పించడం.. ఇందులో భాగంగా 525 చదరపు అడుగుల ప్లాట్‌ విస్తీర్ణంతో, అన్‌డివైడెడ్‌ షేర్‌ విధానంలో సుమారు 20 నుంచి 25 గజాల భూమిని లబ్ధిదారుల పేరుతో ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. ప్రాంతాన్ని బట్టి ఈ భూమి విలువ 60 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయలకు పైగానే ఉండే అవకాశం ఉంది.

అంతేకాదు.. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల పూర్తి సబ్సిడీ అందించనుండగా.. లబ్ధిదారుడి వాటా 6 లక్షల రూపాయలు మాత్రమే. ఆ మొత్తాన్ని కూడా నాలుగు విడతల్లో చెల్లించే అవకాశం కల్పించారు. మొత్తంగా జీవితాంతం అద్దె ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి నుంచి పేద కుటుంబాలను బయటకు తీసుకువచ్చి.. హైదరాబాద్‌ నగరంలోనే సొంతింటి యజమానులుగా, ఆత్మగౌరవంతో నిలబెట్టడమే ఇందిరమ్మ టవర్స్‌ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

#Telangana#Hyderabad#QR#Indiramma Towers#poors-dream#tender-process
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి