రాష్ట్రంలో ప్రభుత్వ బడుల నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. దీంతో ప్రభుత్వం అనుసరుస్తున్న విధానాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఆర్థిక స్థోమత లేక చదువు బాగా చెబుతారని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో తమ పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులు బాధపడేలా ప్రభుత్వ యంత్రాంగం పనితీరు ఉన్నట్టు సమాచారం. వారికి వడ్డించే భోజనం, ఇచ్చే దుస్తులు సరిగా ఉండటం లేదని,టీచర్లు పాఠాలు సరిగా చెప్పడం లేదని, పిల్లలు ఆరోపిస్తున్నారు.ఇక కొందరు టీచర్లు టైం పాస్ కోసమే పాఠశాలలకు వస్తున్నారని, నిత్యం ఫోన్లలోనే మునిగిపోతున్నారని కూడా వరుస ఫిర్యాదులు అందుతున్నాయి.
ఇటీవల ఓ మహిళా టీచర్ విద్యార్థినిలతో జుట్టుకు ఆయిల్ పెట్టించుకోవడం,మసాజ్ చేయించుకునే వీడియోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అవికాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో వార్డెన్లు,ఉపాధ్యాయులు, కరస్పాండెంట్స్ పర్యవేక్షణ లేకపోవడంతో పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఓ వైపు విద్య మాత్రమే నామమాత్రం అందుతుందంటే..ఫుడ్ కూడా సరిగా ఉండటం లేదని సమాచారం.
తాజాగా మరో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది.ఉదయం బ్రేక్ ఫాస్ట్ తిన్న విద్యార్థులు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే 13 మంది విద్యార్ధులను ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఖమ్మం జిల్లా వేంనూరు మండలం మర్లపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. అల్పాహారం తిన్న కొద్దిసేపటికి కడుపు నొప్పి, వాంతులతో ఇబ్బంది పడిన 13 మంది విద్యార్థులను చికిత్స నిమిత్తం పాఠశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి.


