తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సోమవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన కీలక భేటీలో సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజుల పాటు కొనసాగుతాయి, సభ ముందుకు రానున్న అజెండా అంశాలు ఏమిటనే దానిపై త్వరలోనే పూర్తి స్పష్టత రానుంది.
ఈ సారి జరగబోయే శాసనసభ సమావేశాల్లో రేవంత్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస వయోపరిమితిని ప్రస్తుతం ఉన్న 25ఏళ్ల నుంచి 21ఏళ్లకు తగ్గించాలని కోరుతూ సభలో తీర్మానం ఆమోదించనున్నారు. చట్టసభల్లో యువత భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా రూపకల్పన చేసిన ఈ తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం, కేంద్ర ప్రభుత్వానికి పంపి పార్లమెంట్‌లో అవసరమైన చట్టసవరణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరనున్నారు.
ఈ సమావేశంలో నియోజకవర్గాల అభివృద్ధి పనులు, మౌలిక వసతులపై ముఖ్యమంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న వివిధ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భూసేకరణలో ఏమాత్రం జాప్యం జరిగినా ప్రాజెక్టుల నిర్మాణం నిలిచిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రాజెక్టుల భూసేకరణ, బాధితుల పునరావాసం, అటవీ శాఖ అనుమతులకు అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రతి శాసనసభ్యుడు తమ సొంత నియోజకవర్గ అభివృద్ధిపై, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రాజెక్టుల పూర్తికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుండటంతో రాబోయే అసెంబ్లీ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి.


