రాష్ట్రంలో ప్రస్తుతం ఖైరతాబాద్ ఉపఎన్నిక హాట్‌టాపిక్ అయ్యింది.ఈ క్రమంలోనే తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. ఖైరతాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టంచేశారు.శనివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ సర్కార్ కేటీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ డ్రామా నడుపుతోందని పేర్కొన్నారు.
ఇదంతా లోపాయికారీ ఒప్పందంలో భాగమే అని ఆరోపించారు.కేటీఆర్ ఫామ్‌హౌస్‍పై ఎలాంటి చర్యలు ఉండబోవని స్పష్టంచేశారు. ఇది కేవలం మాటల ప్రభుత్వం మాత్రమే అని.. చేతలు శూన్యం అని విమర్శించారు. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై స్పందించిన ఆమె.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చిన్నారుల మరణాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ఆర్టీఐ సమాచారం ఆధారంగా 2000-21లో 6,239 మంది చిన్నారులు ప్రభుత్వాస్పత్రిలో మరణిస్తే 2021-22లో 4,993 మంది, 2024-25లో 3,853 మంది మరణించారన్నారు.
అన్ని జిల్లాల్లోనూ చిన్నారుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. హైదరాబాద్‍లోని ప్రభుత్వాస్పత్రిలో గతేడాది 1,046 మంది చిన్నారులు మరణించారని తెలిపారు. ప్రభుత్వ ఆస్ప్రతుల్లో సౌకర్యాలుు మెరుగుపరుస్తామని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఆరోగ్య రంగానికి కేటాయించిన బడ్జెట్ కేవలం 5 శాతం మాత్రమే అని గుర్తుచేశారు.
ఆదిలాబాద్ రిమ్స్‌లో ప్రమాదం జరిగాక మంత్రులు, ప్రజాప్రతినిధులు వస్తున్నా అక్కడ పరిశుభ్రత పాటించడం లేదన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పరిశుభ్రత లేకపోతే ఫోటోలు, వీడియోలు తీసి టీఆర్ఎస్ సోషల్ మీడియాకు ట్యాగ్ చేయాలని కవిత పిలుపునిచ్చారు. ఒక్కొక్కరి తోలు తీస్తామని హెచ్చరించారు. ఎంత సేపటికి రాజకీయాలేనా? విద్యా, వైద్యంపై ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదా? అని నిలదీశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు పాఠశాలల బాట పట్టాలని, ఎక్కడైతే బాత్ రూమ్స్ లేవో వాటిని ఫోటో తీసి ట్యాగ్ చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పార్టీ తరఫున నిధులు జమ చేసి నిర్మాణాలు చేపడతామన్నారు.









