ఫ్రెంచ్ నటుడు, దర్శకుడు ఆర్నాడ్ డెనిస్ జీవితం విషాదాంతమైంది. కేవలం 43 ఏళ్ల వయసులోనే ఆయన బెల్జియంలో కారుణ్య మరణం ద్వారా కన్నుమూశారు. కొన్నేళ్లుగా తీవ్రమైన అనారోగ్యం, భరించలేని నొప్పులతో పోరాడిన ఆయన.. చివరకు వైద్యుల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 22న బెల్జియంలోని నామూర్‌లో ముగ్గురు వైద్యులతో సంప్రదింపుల అనంతరం ఈ ప్రక్రియ జరిగినట్లు ఆయన న్యాయవాది ఫిలిప్ కోర్టువా వెల్లడించారు.
ఆర్నాడ్ డెనిస్ ఆరోగ్య సమస్యలు 2023లో మొదలయ్యాయి. హెర్నియాకు చికిత్స కోసం జూలై 17న శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ సమయంలో పాలీప్రొపైలీన్‌తో తయారు చేసిన హెర్నియా ఇంప్లాంట్‌ను అమర్చారు. ఆ తర్వాత తీవ్ర నొప్పులు, కండరాల బలహీనత, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు సహా అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని డెనిస్ తెలిపారు. పరిస్థితి మరింత దిగజారడంతో 2024 ఏప్రిల్‌లో అమెరికాలో మరో శస్త్రచికిత్స చేయించుకుని ఆ ఇంప్లాంట్‌ను తొలగించుకున్నారు.
తదుపరి ఆయనకు మయాల్జిక్ ఎన్సెఫలోమైలిటిస్ అనే తీవ్రమైన అనారోగ్య పరిస్థితి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇంప్లాంట్ కారణంగా నిరంతర ఇన్‌ఫ్లమేషన్ ఏర్పడి, రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపిందని ఆయన ఆరోగ్య నివేదికలు పేర్కొన్నాయి. ఇక ఆర్నాడ్ తన చివరి రోజుల్లో సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశాన్ని కూడా పంచుకున్నారు. మూడేళ్లుగా అనుభవిస్తున్న బాధ తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని, శారీరక సామర్థ్యం, జీర్ణక్రియతో పాటు సాధారణ జీవితం కూడా తనకు దూరమైందని ఆయన పేర్కొన్నారు. తన నిర్ణయం ఎవరినీ ప్రేరేపించకూడదని, తన అనుభవం ద్వారా ఇలాంటి ఆరోగ్య సమస్యలపై మరింత పరిశోధన జరగాలని కోరుకున్నారు.
మరోవైపు నటుడిగానే కాకుండా దర్శకుడు, రచయితగా కూడా ఆర్నాడ్ డెనిస్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ది లెర్న్డ్ లేడీస్, డేంజరస్ లయిజన్స్ వంటి నాటకాలను తెరకెక్కించి రంగస్థలంలో పేరు సంపాదించారు. 2009లో లెస్ ఫెమ్స్ సవాంటెస్ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించి బ్రిగేడియర్ అవార్డును అందుకున్నారు. చివరి దశలో తన బాధను ప్రజలకు తెలియజేయడంతో పాటు, హెర్నియా ఇంప్లాంట్ల వల్ల ఎదురయ్యే సమస్యలపై అవగాహన కోసం బాధితుల సమూహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక 43 ఏళ్ల వయసులో ఆర్నాడ్ డెనిస్ కారుణ్య మరణంపై మరోసారి అంతర్జాతీయ చర్చకు దారితీసింది..









