SIR: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రాణవాయువు పారదర్శకమైన ఎన్నికల ప్రక్రియ. ఆ ప్రక్రియకు గుండెకాయ వంటిది నిష్పాక్షికమైన ఓటర్ల జాబితా. స్వతంత్ర భారతంలో దశాబ్దాలుగా ఎన్నికల సంఘం (ఈసీ) అంటే ఒక అపారమైన విశ్వసనీయత ఉంటూ వచ్చింది.
రాజకీయ పార్టీలు ఎన్ని విమర్శలు చేసుకున్నా, ఎన్నికల నిర్వహణలో ఈసీ తీసుకునే నిర్ణయాలకు ప్రజాక్షేత్రంలో ఒక ప్రత్యేక గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైనట్లు కనిపిస్తుందనే కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి. ఓటర్ల జాబితాను పకడ్బందీగా ప్రక్షాళన చేస్తామంటూ కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (సర్) కార్యక్రమం.. ఇప్పుడు అదే కమిషన్ మెడకు అతిపెద్ద ఉచ్చులా చుట్టుకుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
మ్యాపింగ్‌తో మొదలైన చిన్నపాటి సమస్యలు.. చివరకు సామాన్యుల నుంచి వీఐపీల వరకు లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యే దుస్థితికి దారితీశాయని అంటున్నారు. ఇది చాలదన్నట్లు, ఏకంగా ఎన్నికల కమిషన్ అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కడం, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుబట్టే స్థాయికి వ్యవహారం ముదరడం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఎన్నికల సంఘం ఇంతలా ఎందుకు బద్నాం అవుతోంది? తెరవెనుక జరిగిన తప్పిదాలేంటి? అనేది తెలుసుకుందాం.
ముగ్గురు సభ్యుల కమిషన్‌లో నో ఏకాభిప్రాయం..
ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన ఒక మల్టీ మెంబర్ బాడీ. ఇందులో సీఈసీతో పాటు ఇద్దరు కమిషనర్లు ఉంటారు. కీలక నిర్ణయాలన్నీ పరస్పర చర్చలు, ఏకాభిప్రాయంతో జరగాలి. కానీ ‘సర్’ విషయంలో ఈ ప్రాథమిక సూత్రమే గాల్లో కలిసిపోయిందన్న ఆరోపణలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపాయి.
‘సర్’ అమలు తీరుపై తోటి ఎన్నికల కమిషనర్లు గత 10 నెలల వ్యవధిలోనే ఏకంగా 14 సార్లు లిఖితపూర్వకంగా తమ అభ్యంతరాలను నమోదు చేసినట్లు అంతర్గత నోట్ ఫైల్స్ ద్వారా బయటకు వచ్చింది. అయినా సీఈసీ వాటిని ఖాతరు చేయకుండా ముందుకే వెళ్లారనే ప్రచారం ఈసీ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీసిందని అంటున్నారు.
కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ‘ఫామ్-6’లో అదనపు డిక్లరేషన్‌ను చేర్చడం రాజ్యాంగ సంక్షోభానికి దారితీసిందని చెబుతున్నారు. పార్లమెంటులో చట్ట సవరణ జరగకుండా ఇలాంటి నిబంధనలు పెట్టడం చెల్లదని ఓ కమిషనర్ తీవ్రంగా వాదించినా, దాన్ని బుట్టదాఖలు చేశారన్న కథనాలు ప్రజాస్వామ్యవాదులను విస్మయానికి గురిచేస్తున్నాయి.
నాలుగు నెలలుగా నో మీటింగ్స్
గత నాలుగు నెలల్లో పూర్తిస్థాయి కమిషన్ భేటీ ఒక్కటి కూడా జరగలేదన్న అంశం.. ‘సర్’ నిర్ణయాలన్నీ ఏకపక్షంగానే సాగాయన్న విమర్శలకు బలం చేకూర్చింది. సర్ వివాదం ముదరడంతో కమిషన్‌లో భేదాభిప్రాయాలు సహజమని, ఈసీ ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఓటర్లకు చాంతాడంత నోటీసులు..
లక్ష్యాలు కాగితాల మీద ఘనంగా ఉన్నా, క్షేత్రస్థాయిలో ‘సర్’ అమలు పూర్తిగా గాడితప్పిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు సమస్యంతా క్షేత్రస్థాయి అధికారుల వ్యవహారశైలితోనే స్టార్ట్ అయ్యిందని అంటున్నారు. రాజ్యాంగ నిర్మాతలు ఈసీకి ఓటర్ల జాబితా సవరించే అధికారం ఇచ్చింది దేశ పౌరులందరికీ ఓటు హక్కు కల్పించడానికి తప్ప, ఉన్న ఓట్లను తొలగించడానికి కాదు. కానీ సర్ ప్రక్రియలో భాగంగా జరుగుతున్న ప్రక్రియలు గ్రౌండ్ లెవల్‌లో దీనికి పూర్తి విరుద్ధంగా మారిందనే కామెంట్స్ జనాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి.
మూడు తరాల చరిత్ర అడగడమేంటి?
ఓటరు నమోదు, ధ్రువీకరణ పేరుతో సామాన్య ప్రజలకు బూత్ స్థాయి అధికారులు చాంతాడంత నోటీసులు పంపడం మొదలుపెట్టారు. చిన్నపాటి చిరునామా మార్పులకే మూడు తరాల పుట్టుపూర్వోత్తరాల రికార్డులు తేవాలంటూ వేధించడంతో సామాన్యులు హడలిపోయారు. పనులు మానుకుని అధికారుల చుట్టూ తిరగడం భారంగా మారి, విసిగిపోయిన ఎంతోమంది విచారణలకు వెళ్లడం మానేశారు. దీన్నే సాకుగా చూపి, సకాలంలో వివరాలు ఇవ్వకపోతే ఓట్లు తొలగిస్తామంటూ బెదిరింపు ధోరణి ప్రదర్శించడం విమర్శలకు దారితీసింది.
స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఢిల్లీ స్థాయి నుంచి రూపొందించిన కేంద్రీకృత సాఫ్ట్‌వేర్ స్థానిక అధికారుల చేతులను కట్టేసింది. ఫలితంగా లక్షల సంఖ్యలో అర్హులైన పౌరుల పేర్లు ఓటర్ల జాబితాల నుంచి గల్లంతయ్యాయి. బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో స్టార్ట్ అయిన ఈ గందరగోళం.. రాజకీయ వివాదాలు పెద్దగా లేని తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర దుమారాన్ని లేపింది. విపక్షాల ఓట్లే కాకుండా, చివరకు అధికార కాషాయ పార్టీకి చెందిన మద్దతుదారుల ఓట్లూ కూడా గల్లంతవుతుండటంతో.. ఈ ప్రక్రియ ఎవరి నియంత్రణలోనూ లేదని తేలిపోయింది.
సీఈసీపై అభిశంసన అస్త్రం..
ఈ పరిణామాలు విపక్షాలకు బలమైన రాజకీయ అస్త్రాన్ని అందించాయి. కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడుతూ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో పాటు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీనికి వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా గళం కలిపాయి. రాజ్యసభలో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న తీర్మానాల ఆధారంగా సీఈసీపై అభిశంసనకు సైతం రంగం సిద్ధం చేస్తున్నట్లు విపక్ష కూటమి హెచ్చరిస్తోంది. 'జంతర్ మంతర్ 2.0' తప్పదని పౌర సంఘాలు హెచ్చరించే స్థాయికి ఉద్యమం రాజుకుంది.
ఈసీ ముందున్న మార్గాలేంటి
ఎన్నికల ఫలితాలు ఎంత ఉత్కంఠగా ఉన్నా, రిజల్ట్ వెలువడ్డాక ప్రజలు దాన్ని అంగీకరించడానికి కారణం ఎన్నికల సంఘంపై ఉన్న నమ్మకమే. అలాంటి రాజ్యాంగబద్ధ వ్యవస్థ ఇప్పుడు స్వయంకృతాపరాధాలతో తీవ్ర అపఖ్యాతిని మూటగట్టుకుంది. దీనికి ముగింపు పలకాలంటే.. ప్రస్తుతం ఈసీ ముందున్న మార్గాలు ఇవే అని అంటున్నారు..
ఇప్పటి వరకు ఈసీ ఇచ్చిన అరకొర ప్రకటనలతో అనుమానాలు తీరవు. అంతర్గత లేఖల్లో వచ్చిన అంశాలపై స్వతంత్ర కమిటీతో సమగ్ర దర్యాప్తు జరిపించి వాస్తవాలను దేశం ముందు ఉంచాలి.
అన్ని రాజకీయ పార్టీలు, పౌర సంఘాల ప్రతినిధులతో తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ‘సర్’ లోపాలను సవరించాలి. షెడ్యూల్ ప్రకారం ఏదో ఒకలా పని పూర్తి చేసేశామనిపించే తొందరపాటును పక్కనపెట్టి, అర్హులైన ఏ ఒక్క పౌరుడి ఓటు హక్కు గల్లంతు కాకుండా చూడాలని అంటున్నారు.
అధికారంలో ఎవరున్నా వ్యవస్థల స్వయంప్రతిపత్తి దెబ్బతింటే అది అంతిమంగా ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు వంటిదని మేధావులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల సంఘం తన రాజ్యాంగ నైతికతను నిరూపించుకుని, ప్రజల్లో పోగొట్టుకున్న విశ్వాసాన్ని తిరిగి సంపాదించుకోకపోతే.. దేశ ఎన్నికల ప్రక్రియ చరిత్రలోనే ఇదొక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందని అభిప్రాయపడుతున్నారు.








