CEC Row: కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఎస్ఐఆర్ పేరుతో అన్యాయంగా ఓట్లు తొలగించారని ఆయన ఆరోపించారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఓట్లు తొలగించిందనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ వివాదంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని వినోద్ కమార్ డిమాండ్ చేశారు. సీఈసీ రాజీనామా చేయకపోతే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని ఆయన కోరారు.
తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు వినోద్ కుమార్. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాధికారాల విషయంలో ఉత్పన్నమవుతున్న భిన్నాభిప్రాయాలు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో పారదర్శకత లోపించడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలన్నారు. ఈ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
''చాలా అన్యాయంగా దేశంలోని చాలా చోట్ల ఓట్లు తొలగించారు. కులం, మతం, ప్రాంతం పేరుతో ఓట్లు తొలగించడం జరుగుతోంది. ఇది బీజేపీ ఉద్దేశపూర్వకంగా చేస్తోంది. బెంగాల్, బీహార్ లో జరిగిన ఎన్నికల సందర్భంగా జరిగిన చర్చ ఇదే. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు కమిషనర్లకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. ఈ ముగ్గురిలో ఇద్దరు చెప్పిన నిర్ణయాన్ని అమలు చేయలేదు. కాబట్టి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తప్పు చేశారు. అందుకే, ఆయన రాజీనామా చేయాలని అంతా అడుగుతున్నారు. లేదా తొలగించమంటున్నారు.
పార్లమెంటులో అభిశంసనకు చాలా సమయం పడుతుంది. సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకోవాలి. రాజ్యాంగపరంగా సుప్రీంకోర్టుకు అధికారం ఉంది. ఎన్నికల వ్యవస్థ, వాటిని నిర్వహించే ప్ర్రక్రియ పట్ల అనుమానం సామాన్య ప్రజలకు వచ్చిందంటే ఇక ప్రజాస్వామ్యం నిలబడదు'' అని వినోద్ కుమార్ హెచ్చరించారు.
కేంద్ర ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు గత 10 నెలల కాలంలో కనీసం 14 సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు, ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయని వినోద్ కుమార్ తెలిపారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక్కరే అంతిమ నిర్ణయం తీసుకునే అధికారి కాదన్నారు.
ముగ్గురు సభ్యుల కమిషన్‌లో నిర్ణయాలు ఏకగ్రీవంగా లేదా మెజారిటీ ప్రాతిపదికన జరగాలని స్పష్టం చేశారు. కోట్లాది మంది ఓటర్లపై ప్రభావం చూపే ఎస్ఐఆర్ వంటి ప్రక్రియలో ఇద్దరు కమిషనర్లు తెలిపిన అభ్యంతరాలు ఏంటి? కమిషన్ వాటిపై ఏం నిర్ణయం తీసుకుంది? ఈ విషయాలు ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.








