CEC Row: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఈసీ జ్ఞానేశ్వర్ ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని, అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR)పై మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. దేశంలో ఓటు చోరీ జరుగుతోందన్నది వాస్తవం అన్నారాయన. బీజేపీకి అవసరం ఉన్న చోట ఓట్ల చోరీ జరుగుతోందన్నారు. ఈసీ చేపట్టిన సర్ ప్రక్రియపై యువతరం ఆందోళన చెందుతోందన్నారు. అందుకే రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారని చెప్పారు.
''బీజేపీ కుతంత్రం ఎలా ఉందంటే.. వారికి అవసరం ఉన్న చోట్ల ఓట్ చోరీ చేస్తారు. మహారాష్ట్రలో పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజారిటీ వచ్చింది, ఆ తర్వాత 3 నెలలకే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఏంటి? అదే ప్రజలు కదా ఓటు వేసింది. మరి విభిన్నమైన ఫలితం రావడం ఏంటి? ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు మెజారిటీ వస్తున్నప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు రావడం లేదు? ఓటర్లు ఒకరే అయినప్పుడు ఎన్నికల ఫలితాల్లో ఇంత వ్యత్యాసం ఎలా ఉంటోంది?
ఓట్ చోరీ జరుగుతోంది అనేది సుస్పష్టం. యాంత్రికంగా దాన్ని రుజువు చేయలేకపోవచ్చు. ఎక్కడో ఒక చోట ఈ అవకతవకలు జరుగుతున్నాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించాలి, అరెస్ట్ చేయాలి. ఎస్ఐఆర్ ప్రక్రియ, ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపునకు నిరసనగా.. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాలు చేపడతాం'' అని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.










