నేటి ఆధునిక డిజిటల్ యుగంలో సాంకేతికత ఊహించని వేగంతో మార్పు చెందుతుంది. అందులోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ జీవితాన్ని అమితంగా ప్రభావితం చేస్తోంది. ఒకప్పుడు సినిమాలకే పరిమితమైన ఈ సాంకేతికత, నేడు మన దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా మారిపోయింది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి చిన్న విషయంలోనూ ఏఐ మనకు తెలియకుండానే సాయపడుతోంది.
అయితే ఏఐ వల్ల మేలుతో పాటు కీడు కూడా ఉందనే ఆరోపణలు ఉన్నాయి.. ముఖ్యంగా ప్రపంచం మొత్తం ఏఐ మీద ఆధారపడే పరిస్థితి తలెత్తితే మానవ భవిష్యత్తుకే పెద్ద ముప్పుగా మారుతుందనే ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏఐ టెక్నాలజీని అడ్డుపెట్టుకుని కేటుగాళ్లు ఏకంగా ఓ భారీ బ్యాంక్ మోసానికి తెరలేపారు. బ్యాంక్ సీఈఓ పేరుతో నకిలీ వాట్సాప్ మెసేజ్.. ఆ తర్వాత పరిచయమున్న ప్రముఖ న్యాయవాది గొంతును ఏఐతో క్లోన్ చేసి ఫోన్ కాల్ చేశారు..
ఇలా నమ్మకాన్ని కలిగించి దాదాపు రూ.వెయ్యి కోట్ల విలువైన నిధులను విదేశీ ఖాతాలకు తరలించిన ఘటన ఇటలీలో వెలుగులోకి వచ్చింది. ఈ భారీ సైబర్ మోసం ఇంటెసా సాన్‌పాలో గ్రూప్‌కు చెందిన ఫిడ్యూరమ్‌లో జరిగింది. 2026 ఫిబ్రవరిలో అప్పటి ఫిడ్యూరమ్ ఛైర్మన్ పావొలో మోలెసినికి ఇంటెసా సాన్‌పాలో సీఈఓ కార్లో మెస్సీనా నుంచి వచ్చినట్టుగా ఓ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. విదేశాల్లో అత్యవసర ఆర్థిక లావాదేవీ ఉందని, ఫిడ్యూరమ్ ట్రెజరీ నుంచి వెంటనే నిధులు బదిలీ చేయాలని అందులో సూచించారు.
ఆ మెసేజ్‌తో ఆగకుండా మోసగాళ్లు మరో అడుగు ముందుకేశారు. మోలెసినికి పరిచయమున్న ప్రముఖ న్యాయవాది పావొలో నస్తాసి పేరుతో ఫోన్ కాల్ చేశారు. ఆ ఫోన్‌లో వినిపించిన గొంతు నిజమైన న్యాయవాది గొంతులానే ఉండటంతో అనుమానం రాలేదు. అయితే ఆ గొంతును ఏఐ వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీతో కృత్రిమంగా రూపొందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నకిలీ ఈమెయిల్స్, పత్రాలు, బ్యాంకు వివరాలతో మొత్తం వ్యవహారాన్ని మరింత నమ్మదగినదిగా మార్చారు.
దీంతో మోలెసిని తన ఫైనాన్స్ విభాగాన్ని సంప్రదించి వరుసగా విదేశీ ఖాతాలకు నిధులు బదిలీ చేయించారు. మొత్తం సుమారు 95 మిలియన్ యూరోలు.. అంటే భారత కరెన్సీలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైన నిధులు బదిలీ అయ్యాయి. ఈ మొత్తంలో ఎక్కువ భాగం చైనా, హాంకాంగ్‌లోని ఖాతాలకు వెళ్లినట్లు నివేదికలు చెబుతున్నాయి.
అయితే అనుమానాస్పద లావాదేవీలను ఫిడ్యూరమ్ సంస్థ వెంటనే గుర్తించి.. తక్షణమే విదేశాల్లోని బ్యాంకులను, సిబ్బందిని అలర్ట్ చేసినట్లు సదరు కథనాలు తెలిపాయి. ఈ చర్యల వల్ల దాదాపు రూ.570 కోట్ల నగదును రికవరీ చేయగలిగారు. కానీ, మిగతా మొత్తం పలు విదేశీ ఖాతాల్లోకి బిట్‌కాయిన్, ఇతర క్రిప్టోకరెన్సీలుగా మారిపోవడంతో వాటిని గుర్తించలేకపోయినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఇదే తరహాలో ఏఐ, నకిలీ మెసేజ్‌లు, వాయిస్ క్లోనింగ్‌ను ఉపయోగించి ఇతర బ్యాంకులపై జరిగిన మరికొన్ని మోసాలపైనా దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఇటలీ అధికారులు వెల్లడించారు.








