ADR Report: భారత రాజకీయాల్లో ఎన్నికలు ముగియడమే ఆలస్యం.. సిద్ధాంతాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రజలు ఒక గుర్తును చూసి ఓటేస్తే, గెలిచిన నేతలు మాత్రం ఏమాత్రం సంకోచం లేకుండా అధికార పార్టీల పంచన చేరుతున్నారు. ఇటీవల 'అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్' (ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్ రిలీజ్ చేసిన తాజా డేటా ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది.
2022 నుంచి 2026 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఏకంగా 111 మంది ప్రజాప్రతినిధులు (26 మంది లోక్‌సభ ఎంపీలు, 7 గురు రాజ్యసభ సభ్యులు, 78 మంది ఎమ్మెల్యేలు) పార్టీ ఫిరాయించారనే వాస్తవం ప్రజాస్వామ్య వ్యవస్థల పనితీరుపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.
దక్షిణాది వేదికగా తెలంగాణ రగడ..
ఈ ఫిరాయింపుల పర్వంలో తెలంగాణ రాజకీయాలు ప్రత్యేక చర్చకు దారితీశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేల్లో 9 మంది కాంగ్రెస్ గూటికి చేరారని ADR నివేదిక అధికారికంగా తేల్చింది. అయితే ఇతర రాష్ట్రాల్లో లాగా ఇక్కడ వ్యవహారం అంత తేలిగ్గా క్లోజ్ కాలేదు.
ఫిరాయింపులపై న్యాయపోరాటం తీవ్రరూపం దాల్చడంతో తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు గట్టి షాక్ తగిలింది. హైకోర్టు ఆయనపై అనర్హత వేటు వేయడం, అనంతరం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కితే అక్కడ కూడా ఊరట దొరకపోవడంతో ఎమ్మెల్యే సీటు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఘటనతో కండువాలు మార్చే నేతలకు న్యాయస్థానాలు గట్టి హెచ్చరిక జారీ చేసినట్లయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బెంగాల్‌లో ఏకంగా 20 మంది జంప్
మరోవైపు పశ్చిమ బెంగాల్ వ్యవహారం సంచలనం సృష్టించింది. తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎన్నికైన ఏకంగా 20 మంది లోక్‌సభ ఎంపీలు ఒకేసారి లైన్ దాటి 'నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా'లో చేరడం జాతీయ స్థాయిలో దుమారానికి దారితీసింది.
తాము విలీనమయ్యామని సదరు ఎంపీలు వాదిస్తుండగా, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం వారిపై వేటు వేయాలని టీఎంసీ పట్టుబడుతోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం లోక్‌సభ స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉంటూ ఉత్కంఠ రేపుతోంది.
నాగాలాండ్ టూ మహారాష్ట్ర..
ఈశాన్యం నుంచి పశ్చిమ తీరం వరకు ఫిరాయింపుల పర్వం యథేచ్ఛగా సాగింది. దేశంలోనే అత్యధికంగా 32 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఏకైక రాష్ట్రంగా నాగాలాండ్ రికార్డ్ సృష్టించింది. అధికార NDPP నుంచి 25 మంది, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి ఏడుగురు ఎమ్మెల్యేలు నాగా పీపుల్స్ ఫ్రంట్ (NPF) తీర్థం పుచ్చుకున్నారు.
మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) వర్గం నుంచి గెలిచిన ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ శిండే వర్గానికి మద్దతు పలకగా, గోవాలో కాంగ్రెస్ నుంచి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు అధికార బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే పంజాబ్‌లో ఆరుగురు రాజ్యసభ ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 8 మంది ప్రజాప్రతినిధులు గోడలు దూకారు.
ఫిరాయింపుల చట్టం డమ్మీయేనా
సాధారణ ఫిరాయింపులు, విలీనాలు, రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయడం, అనర్హత వేటు పడ్డాక నెగ్గడం.. ఇలా రకరకాల ఎత్తుగడలతో నేతలు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను తుంగలో తొక్కుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓటర్లు ఇచ్చిన తీర్పును స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతున్న తీరుపై సామాన్య పౌరుల్లో అసహనం వ్యక్తమవుతోంది.
తెలంగాణ నుంచి బెంగాల్ వరకు విస్తరించిన ఈ 111 మంది నేతల జంపింగ్ వ్యవహారం.. దేశంలో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత కఠినతరం చేయాల్సిన ఆవశ్యకతను మరోసారి గుర్తుచేస్తోంది.








