Ktr: నిత్యం రాజకీయ వ్యవహారాలతో బిజీబిజీగా ఉండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపు రిలాక్స్ అవ్వనున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆయన సినిమా చూసేందుకు థియేటర్ కి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన 'ది ప్యారడైజ్' సినిమాను శనివారం రాత్రి చూడబోతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. తాను అభిమానించే నటుల్లో నాని ఒకరు అని కేటీఆర్ తెలిపారు.
‘‘చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు రాత్రి థియేటర్‌లో సినిమా చూడాలనుకుంటున్నా. నా అభిమాన నటుడు నాని, ప్రతిభావంతుడైన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలిసి తీసిన ‘ది ప్యారడైజ్’ చూడబోతున్నా’’ అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు కేటీఆర్.
ప్యారడైజ్ మూవీ గోదావరిఖని బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంది. కేటీఆర్ థియేటర్‌కు వెళ్లడానికి సినిమాపై ఉన్న ఇష్టం ఒక కారణం. ఇది కాకుండా మరో ప్రధాన కారణం కూడా ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాలో నటుడు ప్రియదర్శి పోషించిన ‘ఎమ్మెల్యే శంకరన్న’ పాత్ర కేసీఆర్ శైలిని పోలి ఉందనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కథను కీలక మలుపు తిప్పే ఈ పాత్ర చుట్టూ కొన్ని రోజులుగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. సవారీ తెగకు, శంకర్ పాత్రకు మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్ స్వయంగా ఈ సినిమాను చూసేందుకు వెళ్తుండటం సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తికరంగా మారింది.









