Paid Reviews: సినిమా అంటే ఒకప్పుడు కళ, కోట్లాది మంది అభిమానం. ఇప్పుడు మాత్రం కొందరు స్వార్థపరుల చేతుల్లో అది సులువైన బ్లాక్‌మెయిలింగ్ దందాలా మారిపోయింది. టికెట్ తెగి తెరపై బొమ్మ పడకముందే 'ఎక్స్' (ట్విట్టర్), యూట్యూబ్‌లలో స్టార్ రేటింగుల బేరసారాలు మొదలవుతున్నాయి. పైసలు ముట్టజెప్పిన మేకర్స్‌కు ఆకాశమంత పొగడ్తలు, ప్యాకేజీలు తిరస్కరించిన చిత్రాలకు పాతాళమంత నెగెటివిటీని కట్టబెడుతున్న ఈ "రివ్యూ సిండికేట్" ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
కవర్ల బరువును బట్టే స్టార్ రేటింగ్స్
నేటి సినీ విశ్లేషణల ముసుగులో జరుగుతున్న తంతు అంతా ఇంతా కాదు. నిర్మాణ సంస్థల నుంచి ముట్టే ప్యాకేజీల ఆధారంగానే రివ్యూల స్వభావం మారుతోందన్న ఆరోపణలు బహిరంగ రహస్యంగా మారాయి. కాసుల వర్షం కురిపించిన ప్రాజెక్టులకు డల్ కంటెంట్ ఉన్నా ‘కల్ట్ క్లాసిక్’ అని బిరుదులు ఇవ్వడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. డీల్స్ కుదరని సినిమాల ఫస్ట్ షో ముగియకముందే 'డిజాస్టర్' అనే ముద్ర వేసి ప్రేక్షకులు థియేటర్ వైపు రాకుండా చేయడం కొంత మంది చేస్తున్నారు. ఈ పైరసీ రేటింగుల వల్ల సాధారణ ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చి స్వయంగా నిర్ణయం తీసుకునే కనీస స్వేచ్ఛను కూడా కోల్పోతున్నాడనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
బలిపీఠంపై చిన్న, పెద్ద ప్రాజెక్టులు
ఈ వ్యవస్థీకృత నెగెటివ్ ప్రచారానికి భారీ బడ్జెట్ నుంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల వరకు అన్నీ బలవుతున్నాయి. గతంలో విడుదలైన భారీ చిత్రం 'టాక్సిక్' మొదలుకొని, తాజాగా వచ్చిన 'ది ప్యారడైజ్', 'అనుమాన పక్షి' వంటి చిత్రాల వరకు ఈ దాడి ప్రభావానికి గురైనవే. కంటెంట్ బాగుండి, మెల్లగా మౌత్ టాక్‌తో పుంజుకునే సత్తా ఉన్న ప్రాజెక్టులను సైతం కొందరు పలికట్టుకొని మరి తొలి రోజే భూస్థాపితం చేస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఒక సినిమాను నిలబెట్టేందుకు కనీసం మూడు నాలుగు రోజుల సమయం కూడా దక్కకుండా విషం చిమ్ముతుండటంతో కోట్ల రూపాయల పెట్టుబడులు ఆవిరైపోతున్నాయనే మేకర్స్ వాదన సామాన్యులను సైతం ఆలోచింపజేస్తుంది.
రక్తం ధారపోస్తే.. ఫేక్ రివ్యూలతో చంపేస్తారా?
వందల కోట్ల రిస్క్, వేలాది మంది కార్మికుల కష్టం, ఏళ్ల తరబడి పడే శ్రమను కొన్ని నిమిషాల యూట్యూబ్ వీడియోలు, వ్యూస్ పిచ్చితో చేసే ట్రోల్స్ నిలువునా దహించివేస్తున్నాయి. ఇటీవల కాలంలో పలువురు నిర్మాతలు, దర్శకులు ప్రెస్‌మీట్లలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ ఫేక్ రివ్యూవర్ల తీరుపై నిప్పులు చెరిగారు. సినిమాను విశ్లేషించే హక్కు అందరికీ ఉన్నప్పటికీ, వ్యక్తిగత దూషణలకు దిగడం, కావాలని డీగ్రేడ్ చేయడం అక్షరాలా నేరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.
సినిమా అంటే కేవలం ఒక గంటన్నర లాభనష్టాల వ్యాపారం కాదు, వేలాది మంది సాంకేతిక నిపుణుల జీవితం. ఇలాంటి వ్యవస్థను కొందరు వారి స్వార్థ ప్రయోజనాల కోసం నాశనం చేస్తుంటే యావత్ చిత్ర పరిశ్రమ ఏకతాటిపైకి వచ్చి ఒక సమగ్ర పాలసీని తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందనే బలమైన వాదన ప్రస్తుతం జోరుగా వినిపిస్తుంది. లేదంటే రేపటి రోజున కొత్త నిర్మాతలు, భిన్నమైన స్టోరీలతో వచ్చే దర్శకులు ఇండస్ట్రీ వైపు చూడటమే మానేసే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు.









