హైదరాబాద్ మహానగరంలో వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.నిన్న మధ్యాహ్నం ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా ముగియగా.. నగరం నలుమూలల నుంచి నిన్న రాత్రి వరకు వచ్చిన విగ్రహాలను ఇవాళ ఉదయం ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం చేస్తున్నారు. నేటి సాయంత్రం వరకు నిమజ్జనం ప్రక్రియ పూర్తికానుందని సమాచారం.
అయితే, గణేశ్ నవరాత్రుల్లో స్వామి వారి వద్ద ఉంచిన లడ్డూ ప్రసాదానికి విశేష ప్రాముఖ్యత ఉంటుంది.దానికి నిర్వాహకులు వేలం వేస్తుంటారు.ఈ క్రమంలోనే గణనాథుల లడ్డూ ప్రసాదం వేలం సరికొత్త చరిత్రను లిఖిస్తున్నాయి.భాగ్యనగర చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే బాలాపూర్ గణేష్ లడ్డూ రికార్డును తాజాగా దిల్‌సుఖ్‌నగర్‌లో నిర్వహించిన లడ్డూ వేలం బద్దలుగొట్టి సరికొత్త రికార్డును నెలకొల్పింది.
దిల్‌సుఖ్‌నగర్‌లోని ‘జై గణేశ్ యూత్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో సుమారు 2.5 కోట్లతో అద్భుతంగా డెకరేట్ చేసిన గణపయ్య సన్నిధిలో శనివారం లడ్డూ వేలం ఘనంగా నిర్వహించారు. పోటాపోటీగా సాగిన ఈ వేలంలో గణపతి లడ్డూ ప్రసాదం రూ.51 లక్షల ధర పలికింది. స్థానిక భక్తుడు రాజేష్ రూ.51 లక్షలు వెచ్చించి ప్రసాదాన్ని సొంతం చేసుకున్నాడు.
మరోవైపు అదే మండపంలో స్వామి వారికి సమర్పించిన మరో లడ్డూను ఓ భక్తుడు రూ.25 లక్షలు వెచ్చించి వేలం పాటలో దక్కించుకున్నాడు. అయితే, ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ వేలం పాటలో రూ.39 లక్షల ధర పలికింది. దిల్‌సుఖ్‌నగర్ లడ్డూ రూ.51 లక్షలు పలకడంతో ఇంతకాలం బాలాపూర్ లడ్డూ పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. ఈ రెండింటికంటే అత్యధికంగా కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో పాడిన వేలం పాటలో లడ్డూ ధర రూ.1 కోటికి పైగా పలికింది. ఆ లడ్డూ వేలం పాటలో గేటెడ్ కమ్యూనిటీ మొత్తం పాల్గొంటుంది.కానీ, బాలాపూర్, దిల్‌సుఖ్ నగర్‌లో పాడిన వేలం పాటలో కేవలం వ్యక్తి మాత్రమే మొత్తం లడ్డూను దక్కించుకోవడం విశేషం. అందుకే కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లడ్డూ వేలం పాటను పరిగణలోకి తీసుకోవడం లేదని తెలిసింది.
తొమ్మిది రాత్రులు గణపయ్య చెంత ఉండే లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకుంటే సకల శుభాలు చేకూరుతాయని, వ్యాపారాలు దినదినాభివృద్ధి చెందుతాయని, పొలంలో చల్లితే పంటలు బాగా పండుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే పోటీ పడి మరీ భారీ మొత్తాలను వెచ్చించి వేలం పాడుతారు. కాగా, లడ్డూ వేలం ద్వారా వచ్చిన నిధులను సామాజిక,సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని జై గణేశ్ యూత్ అసోసియేషన్ నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు.












