రైలు ఎక్కేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లు ప్రాణాంతకంగా మారొచ్చు. సమయం అయిపోతుందని, రైలు కదులుతోందని కొందరు భయంతో రన్నింగ్ ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేస్తుంటారు. ఆ సమయంలో చేతులు కాస్త తడిగా ఉన్నా హ్యాండిల్ చేయి జారిపోయి కొందరు కిందపడిపోతుంటారు. ప్లాట్‌ఫాం మీద పడితే ఏం కాదు.చిన్న చిన్న గాయాలతో బయటపడే చాన్స్ ఉంది. కానీ రైలు కింద పడితే మళ్లీ ప్రాణాలతో ఉంటామా? లేదా? అనేది అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది.
రైలు జర్నీ సమయంలో కొందరు ఇలాంటి ప్రమాదాలు ఫేస్ చేసే ఉంటారు. ట్రైన్ ఆగిందని కిందకు దిగి నీళ్లు పట్టుకోవడం, తినేందుకు ఏదైనా తెచ్చుకునేందుకు కొందరు వెళ్తుంటారు. తీరా రైలు కదిలిందని ఆదరాబాదరాగా పరుగెత్తి ట్రైన్ క్యాచ్ చేస్తుంటారు. ఆ సమయంలో చిన్న పొరపాటు జరిగినా ప్రాణాల మీదకు రావొచ్చు. తాజాగా ఓ వృద్ధుడికి ఇలాంటి ప్రమాదకర ఘటనే ఎదురైంది.
రైలు ఎక్కుతున్న క్రమంలో ఓ వృద్దుడు పట్టుకోల్పోయి కింద పడ్డాడు. అయితే, అటు ప్లాట్‌ఫాం మీద ,ఇటు రైలు కింద కాకుండా మధ్యలో ఇరుక్కుపోయాడు. రైలు ఫుట్ రెస్ట్ మధ్యలో ఆయన కాలు ఇరుక్కుపోయింది. దాంతో కొంతదూరం వరకు ట్రైయిన్ అయన్ను లాక్కెళ్లింది.ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలోని గిండి రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.వివరాల్లోకివెళితే.. విల్లుపురం - చెన్నై బీచ్ రైలు రన్నింగ్‌లో ఉండగా ఎక్కేందుకు మహమ్మద్ ఇలియాజ్(69) ప్రయత్నించాడు.
ఈ క్రమంలో కాలు జారి కింద పడిపోవడంతో ప్లాట్‌ఫామ్, రైలు మధ్య చిక్కుకుపోయాడు. అప్పటికే రైలు రన్నింగ్‌లో ఉండటంతో.. ఆయన్ను 50 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఇది గమనించిన ప్రయాణికులు వెంటనే కేకలు వేయగా అప్రమత్తమైన లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. వృద్ధుడిని సురక్షితంగా బయటకు తీసి కానిస్టేబుల్ నారాయణ్ సింగ్ రక్షించారు. ఈ ప్రమాదంలో మహమ్మద్ కాలికి గాయాలు కావడంతో చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ దృశ్యం రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.












