ఓపెన్‌ఏఐ ఏజెంట్ల ‘రెడ్ అలర్ట్’..!
అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్లలో గందరగోళం
చేయమన్న పనొకటి.. చేసింది మరొకటి
ఒక్కసారిగా షాకైన టెక్ ప్రపంచం
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మనం చెప్పిన పని మనకంటే వేగంగా చేసి పెట్టే టెక్నాలజీ. కానీ అదే AI తనకు అప్పగించిన పనిని పూర్తి చేసే క్రమంలో.. మనం ఊహించని మార్గంలో వెళ్తే? ఇప్పుడు అమెరికాలో బయటపడిన కొన్ని ఘటనలు ఇదే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. OpenAIకి చెందిన AI ఏజెంట్లు అమెరికా ప్రభుత్వానికి చెందిన కొన్ని వెబ్‌సైట్లతో అనూహ్యంగా వ్యవహరించినట్లు వార్తలొచ్చాయి. అమెరికా విద్యాశాఖ, వాణిజ్య శాఖ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అంటే SECకు సంబంధించిన ఘటనలు ఇందులో ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ప్రభుత్వ రహస్య డేటా భారీగా చోరీ అయినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. అయినా AI ఏజెంట్లు ఏం చేశాయి.. ఎందుకు చేశాయి అనేదే ఇప్పుడు అసలు చర్చగా మారింది.
విద్యాశాఖ వెబ్‌సైట్ టార్గెట్
అమెరికా విద్యాశాఖకు చెందిన సివిల్ రైట్స్ కార్యాలయ వెబ్‌సైట్ నుంచి సమాచారాన్ని సేకరించేందుకు OpenAI ఏజెంట్ ప్రయత్నించినట్లు AI సెక్యూరిటీ సంస్థ ట్రాన్స్ ట్యూస్ పరిశోధకులు గుర్తించారు. అయితే సాధారణంగా సమాచారం కోసం వెబ్‌సైట్‌ను ఉపయోగించాల్సిన AI.. కొన్ని భద్రతా పరిమితులను దాటి సమాచారాన్ని పొందేందుకు ప్రయత్నించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. దీనిని వారు హ్యాకింగ్ ప్రయత్నంగా అభివర్ణించారు. అయితే ఆ ప్రయత్నం విజయవంతం కాలేదని సమాచారం. ఈ ఘటనపై OpenAI మాత్రం ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.
ఇక మరో ఘటన అమెరికా వాణిజ్య శాఖ పరిధిలోని సెన్సెస్ బ్యూరో వెబ్‌సైట్‌కు సంబంధించినది. ఒక OpenAI ఏజెంట్ ఇంటర్నెట్‌లో కనిపించిన లాగిన్ వివరాలను ఉపయోగించి అక్కడి సమాచారాన్ని యాక్సెస్ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే.. యాక్సెస్ చేసిన సమాచారం ప్రజలకు అందుబాటులో ఉన్న పబ్లిక్ డేటానే అని అమెరికా వాణిజ్య శాఖ స్పష్టం చేసింది. ప్రైవేట్ లేదా రహస్య సమాచారం యాక్సెస్ కాలేదని అధికారులు తెలిపారు. అంటే డేటా రహస్యమైనది కాకపోయినా.. దాన్ని పొందేందుకు AI ఎంచుకున్న విధానం మాత్రం ప్రశ్నలను లేవనెత్తింది.
అన్ని ఫైల్స్ సేఫేనా..?
ఇదే సమయంలో SEC వెబ్‌సైట్‌లో ఉన్న పబ్లిక్ సమాచారాన్ని కూడా OpenAI ఏజెంట్లు యాక్సెస్ చేసినట్లు బయటపడింది. ఆ సమాచారాన్ని ఆన్‌లైన్ ఫోరమ్‌లో షేర్ చేసిన ఘటనను OpenAI ధృవీకరించింది. అయితే SEC అధికారులు తమకు తెలిసినంతవరకు ఎలాంటి నాన్-పబ్లిక్ సమాచారం అనధికారికంగా యాక్సెస్ కాలేదని తెలిపారు. అంటే ఇక్కడ కూడా ఇప్పటివరకు రహస్య సమాచారాన్ని దొంగిలించిన ఘటనగా దీనిని చెప్పడానికి ఆధారాలు లేవు.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ AI ఏజెంట్లకు మొదట హ్యాక్ చేయమని ఎవరూ చెప్పలేదని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా ఒక ప్రశ్నకు సమాధానం కనుగొనడం, సమాచారం సేకరించడం లేదా రీసెర్చ్ చేయడం వంటి పనులు AIకి అప్పగించినప్పుడు.. అది వెబ్‌లో సమాచారం కోసం వెతుకుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఎదురైన భద్రతా అడ్డంకులను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ప్రయత్నించినట్లు పరిశోధకులు గుర్తించారు. అంటే మనిషి ఇచ్చిన ఆదేశం ఒకటి అయితే.. దాన్ని పూర్తి చేయడానికి AI ఎంచుకున్న మార్గం మరోలా మారింది అన్నమాట.
ఆన్సర్ కాదు.. అంతకుమించి
ఇదే ఇప్పుడు AI ఏజెంట్ల విషయంలో పెద్ద ప్రశ్నగా మారుతోంది. ఇప్పటివరకు మనం AIని ప్రశ్నలు అడిగితే సమాధానాలు ఇచ్చే టెక్నాలజీగా చూశాం. కానీ AI ఏజెంట్లు అంతకంటే ఒక అడుగు ముందుకెళ్లాయి. అవి స్వయంగా వెబ్‌సైట్లు తెరవగలవు, సమాచారాన్ని వెతకగలవు, ఒక పని తర్వాత మరో పని చేయగలవనేది అర్థమవుతోంది. దీంతో ఈ పని చేయి అని మనిషి చెప్పినప్పుడు.. ఆ పని పూర్తి చేయడానికి AI ఎంతవరకు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలి? ఒక వెబ్‌సైట్ అడ్డుకుంటే అక్కడితో ఆగాలా? లేక మరో మార్గం వెతకాలా? పబ్లిక్ సమాచారం కోసమైనా సెక్యూరిటీ నిబంధనలను దాటే ప్రయత్నం చేయవచ్చా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
OpenAI మాత్రం ఈ ఘటనలను పెద్ద స్థాయి డేటా చోరీగా చూడటం లేదని చెబుతోంది. సంస్థ పరిశీలించిన కార్యకలాపాల్లో ఎక్కువ భాగం సాధారణ రీసెర్చ్ పనుల్లో భాగంగా పబ్లిక్ వెబ్ కంటెంట్‌ను యాక్సెస్ చేయడమేనని తెలిపింది. ప్రభుత్వ వెబ్‌సైట్లను AI తరచుగా ఉపయోగించడానికి కారణం.. అవి అధికారిక సమాచారానికి నమ్మకమైన వనరులు కావడమేనని OpenAI వివరించింది. అయితే కొన్ని సందర్భాల్లో తమ AI వ్యవస్థలు ఊహించని విధంగా వ్యవహరించాయని సంస్థ అంగీకరించింది. ఈ ఘటనలపై సమగ్ర సమీక్ష కొనసాగుతోందని తెలిపింది.
అన్ని AI లది ఇదే వరుస
ఇది ఒక్క OpenAIకి మాత్రమే సంబంధించిన సమస్య కూడా కాదు. ప్రపంచవ్యాప్తంగా AI ఏజెంట్లు మరింత స్వతంత్రంగా పనిచేస్తున్న కొద్దీ.. అవి వెబ్‌సైట్లను ఎలా ఉపయోగిస్తున్నాయి, సెక్యూరిటీ నిబంధనలను ఎలా పాటిస్తున్నాయి, తమకు ఇచ్చిన పనిని పూర్తి చేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి అనే దానిపై ఆందోళనలు పెరుగుతున్నాయి. OpenAIకి సంబంధించిన గత ఘటనలపై జరిగిన సమీక్షలో ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెందిన ఒక వెబ్‌సైట్‌కు సంబంధించిన ఘటనతో పాటు మరికొన్ని అనూహ్య కార్యకలాపాలు కూడా గుర్తించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ సంస్థలు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ ఘటనల్లో రహస్య ప్రభుత్వ సమాచారం బయటకు వెళ్లినట్లు నిర్ధారణ కాలేదు. కానీ అసలు ప్రశ్న డేటా చోరీ జరిగిందా లేదా అన్నదానికంటే పెద్దది. మనిషి ఒక పని అప్పగిస్తే.. ఆ పని పూర్తి చేయడానికి AI తనంతట తానే ఎంత దూరం వెళ్లగలదు? దానికి హద్దులు ఎవరు నిర్ణయిస్తారు? ఆ హద్దులను AI ఎప్పటికీ దాటకుండా ఎలా చూస్తారు? అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్లలో జరిగిన ఈ ఘటనలు ఇప్పుడు ప్రపంచానికి ఇదే ప్రశ్నను ముందుకు తెచ్చాయి.
AI మరింత తెలివిగా మారడం ఒక విషయం.. ఆ తెలివికి హద్దులు పెట్టడం మరో విషయం. భవిష్యత్తులో AI ఏజెంట్ల విషయంలో అసలు సవాల్ ఇదే కావచ్చు.












