తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఆమె త్యాగాలను స్మరిస్తూ ఘన నివాళ్లు అర్పించారు. శనివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. చాకలి ఐలమ్మ తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరమని, అందుకు ఆమె నిలువెత్తు నిదర్శనమని మాజీ సీఎం కొనియాడారు. నిజాం పాలన సమయంలో నిరంకుశ రాచరిక పోకడలు, భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా, రైతాంగం న్యాయమైన హక్కుల కోసం గళమెత్తిన ధీరవనిత అని ప్రశంసించారు.
ఓ వైపు భూస్వామ్య శక్తులను ఎదురిస్తూనే, మరోవైపు చట్టాల పరిధిలో న్యాయస్థానాల్లో న్యాయపోరాటం చేసి గెలిచిన ఆమె ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శనీయం అని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రస్తుత అస్తవ్యస్త పాలనా పరిస్థితుల్లో చాకలి ఐలమ్మ ప్రదర్శించిన ప్రజాస్వామిక పోరాట పంథా, తెలంగాణ సోయి నేటి యువత అనుసరించదగినదని స్పష్టం చేశారు.
మలిదశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చాకలి ఐలమ్మ అందించిన స్ఫూర్తి ఎంతగానో ఇమిడి ఉందని మాజీ సీఎం గుర్తు చేశారు. ఆమె గొప్పతనాన్ని భావితరాలకు చాటేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించే సాంప్రదాయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
పదేండ్ల పాలనలో ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా మహిళా, శిశు సంక్షేమం, రైతాంగ హక్కులు, కులవృత్తుల పునరుజ్జీవనం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి అణగారిన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టామని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగం, సబ్బండ కులాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా నిబద్ధతతో పరిపాలన సాగించడమే చాకలి ఐలమ్మకు మనం అందించే నిజమైన నివాళి అని గులాబీ బాస్ స్పష్టంచేశారు.










