తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వ కొలువే లక్ష్యంగా ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీ పడుతున్న అభ్యర్థులు, ఇప్పుడు ఆర్థిక భారంతో అల్లాడిపోతున్నారు. నోటిఫికేషన్ల జాప్యం, పరిమిత పోస్టుల వల్ల పరీక్షల కోచింగ్, హాస్టల్ ఫీజుల కోసం చేసిన అప్పులు కొండలా పేరుకుపోతుండటంతో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
నిరుద్యోగ సమస్యా వలయంలో చిక్కుకున్న మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఒక అభ్యర్థి ఆవేదన రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. "ఒకప్పుడు రేవంత్ రెడ్డిని చూసి ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నా.. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నాకే సిగ్గుగా అనిపిస్తుంది" అంటూ సదరు నిరుద్యోగి పాలకపక్ష తీరుపై తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశాడు. పోలీస్ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఇప్పటికే సుమారు రూ.2లక్షల రూపాయల వరకు అప్పు చేసి కోచింగ్ తీసుకున్నానని, ఇప్పుడు కుటుంబ పరిస్థితి మరింత దిగజారిందని ఆ యువకుడు కన్నీరుమున్నీరయ్యాడు. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్నా సరైన నోటిఫికేషన్లు రాకపోవడంతో, తదుపరి అవసరాలకు కనీసం అప్పు ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదని తన నిస్సహాయతను వెళ్లగక్కాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రభుత్వం ఇప్పటికైనా నిరుద్యోగుల ఆక్రందనలను ఆలకించాలని యువత డిమాండ్ చేస్తోంది. పోలీస్ శాఖతో పాటు ఇతర విభాగాల్లో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. అరకొర పోస్టులతో కాకుండా, శాఖలవారీగా ఉన్న పూర్తి ఖాళీలకు నోటిఫికేషన్లు ఇచ్చి తమను అప్పుల ఊబి నుంచి, మానసిక క్షోభ నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని అశోక్‌నగర్, దిల్షుక్‌నగర్ వంటి కోచింగ్ హబ్‌లలో వేలాది మంది అభ్యర్థులు ఏళ్ల తరబడి హాస్టళ్లలో ఉంటూ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. నోటిఫికేషన్ల జాప్యం వల్ల గది అద్దెలు, తిండి ఖర్చులు భరించలేక గ్రామీణ ప్రాంతాల్లోని వారి తల్లిదండ్రులు సైతం అప్పులపాలు కావలసి వస్తోంది. ఒకవైపు వయోపరిమితి దాటిపోతుండటం, మరోవైపు ఆర్థిక వనరులు హరించిపోతుండటంతో యువత తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్పష్టమైన ‘జాబ్ క్యాలెండర్’ విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని నిరుద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.












