తెలంగాణ

బీఆర్ఎస్‌కు భారీ షాక్.. అడ్డంగా బుక్కైన ఎమ్మెల్సీ ‘పుత్రరత్నం’!

రచన: Mamatha puppala5 నిమిషాల పఠనం

తల్లిదండ్రుల రాజకీయ పలుకుబడి, కోట్లాది రూపాయల సంపద తెచ్చిపెట్టిన మితిమీరిన విలాసాలు కొందరు ‘పుత్రరత్నాల’ను వెర్రి వేషాలు వేయిస్తున్నాయి.

 తల్లిదండ్రుల రాజకీయ పలుకుబడి, కోట్లాది రూపాయల సంపద తెచ్చిపెట్టిన మితిమీరిన విలాసాలు కొందరు ‘పుత్రరత్నాల’ను వెర్రి వేషాలు వేయిస్తున్నాయి. ఫలితంగా ఇటు రాజకీయ పలుకుబడి ఉన్న జనకులతో పాటు సదరు రాజకీయ పార్టీ పరువు బజారున పడేస్తున్నారు. తాజాగా గులాబీ పార్టీకి చెందిన ఓ మాజీ ఐఏఎస్, ప్రస్తుత ఎమ్మెల్సీ కుమారుడి వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

 తెలంగాణ రాష్ట్రంలో మరోసారి మాదకద్రవ్యాల వ్యవహారం పెను సంచలనం సృష్టిస్తోంది. గతంలో రాష్ట్రంలో కలెక్టర్‌గా సుదీర్ఘ కాలం సేవలందించి, ఆపై బ్యూరోక్రాట్ నుంచి పొలిటీషియన్‌గా మారి గులాబీ పార్టీ తరఫున ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న ఓ సీనియర్ నేత కుటుంబంలో వివాదం రేగింది. కొద్దిరోజుల క్రితమే అత్యంత వైభవంగా, కోట్లాది రూపాయలను నీళ్లలా ఖర్చు చేస్తూ ఆ ఎమ్మెల్సీ తన కుమారుడి వివాహ వేడుకలను అత్యంత అట్టహాసంగా నిర్వహించారు.
ఆ హంగామా ముగిసిందో లేదో, తాజాగా అదే ఎమ్మెల్సీ పుత్రరత్నం మత్తు పదార్థాలు సేవించి  అడ్డంగా దొరికిపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న(బుధవారం) రాత్రి ఈ హైడ్రామా చోటుచేసుకుంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో పోలీసులు ఒక నివాసంపై మెరుపు దాడి నిర్వహించారు. ఈ సోదాల్లో సదరు ఎమ్మెల్సీ కుమారుడు భరత్ మాదకద్రవ్యాలు సేవిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

 అతనితో పాటు ఉన్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం వారు మత్తు పదార్థాలు తీసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో పోలీసులు భరత్ సహా ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించే ప్రక్రియను వేగవంతం చేశారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న గులాబీ పార్టీకి ఈ ఘటన కోలుకోలేని బిగ్ షాక్‌గా మారింది. గతంలో ఆ పార్టీకి చెందిన పైలట్ రోహిత్ రెడ్డి ఏకంగా పార్టీలో మాదకద్రవ్యాలు నిర్వహించారనే ఆరోపణలు వచ్చాయి.

 రోహిత్ రెడ్డి వ్యవహారంలో ఏపీకి చెందిన ఏలూరు ఎంపీ (టీడీపీ నేత) సహా పలువురు బడా బాబులు, వీఐపీలు పట్టుబడటం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారమే లేపింది. ఆ వివాదం ఇంకా పూర్తిగా సద్దుమణగక ముందే, ఇప్పుడు మళ్లీ అదే పార్టీకి చెందిన మరో ముఖ్య నేత (మాజీ ఐఏఎస్ అధికారి) కుమారుడు మాదకద్రవ్యాల కేసులో పట్టుబడటంతో పార్టీ అప్రతిష్ఠ పాలవుతోందని కేడర్ ఆందోళనలో పడింది.

 అధికార యంత్రాంగంలో అత్యున్నత స్థానాల్లో పనిచేసిన ఐఏఎస్ అధికారి ఇంట్లోనే ఇలాంటి అక్రమ ఉదంతాలు వెలుగుచూడటంపై సామాన్య ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనంతో విలాసవంతమైన పెళ్లిళ్లు చేస్తూ, సమాజంలో పెద్దమనుషులుగా చలామణి అవుతున్న నేతల పిల్లలు ఇలా డ్రగ్స్ సంస్కృతికి బానిసలు కావడం సంచలనంగా మారింది. మంగళ్‌హాట్ పోలీసులు ఈ కేసులో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

#BRS MLC Son Arrest#Hyderabad Drug Bust#Mangalhat Police Raid#Political Offspring Scandals#Telangana Drugs Case#BRS Party Shock
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి