ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట (Red Fort)ను పోలీసులు మూసివేశారు. ఆ పరిసరాల్లోకి ప్రస్తుతం ఎవరినీ అనుమతించడం లేదు.సాధారణ సందర్శకులు, పర్యాటకులకు సైతం అనుమతిని నిరాకరించారు. నిన్నటి నుంచే నిషేధాజ్ఞలు అమలులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పురాతత్వ సర్వే సంస్థ (ASI) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
వచ్చే నెలలో భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోనుంది. ఈ క్రమంలోనే ముందస్తు భద్రతా ఏర్పాట్లు, సన్నాహాల దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 'ప్రాచీన కట్టడాలు, పురాతత్వ ప్రదేశాల నిబంధనలు-1959' లోని రూల్ 5 ప్రకారం వచ్చిన అధికారాలను ఉపయోగించి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఏఎస్ఐ వెల్లడించింది.
వాస్తవానికి ఈ నెల 9వ తేదీనే ఆదేశాలు వెలువడినట్టు తెలుస్తోంది. జులై 15 నుంచి 15 ఆగస్టు 2026 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పూర్తయ్యేంత వరకు ఎర్రకోట కాంప్లెక్స్‌లోనికి ఎవరినీ అనుమతించబోమని ఆదేశాలు వెలువడ్డాయి. ప్రతి ఏటా ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. దీంతో కట్టుదిట్టమైన భద్రత, పరేడ్ రిహార్సల్స్, మౌలిక వసతుల ఏర్పాట్ల కోసం ప్రతి ఏటా ముందస్తుగా మూసివేత ప్రక్రియ సాధారణంగానే జరుగుతుందని ఏఎస్ఐ సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యాటకులు సహకరించాలని ఢిల్లీ పోలీసులు, ఏఎస్ఐ కోరింది.












