తెలంగాణ

Highcourt : కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్‌డీఎస్‌ఏకు హైకోర్టు నోటీసులు

రచన: Kumar4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల అంశంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నడుమ పెద్దఎత్తున రాజకీయ విమర్శ, ప్రతివిమర్శలు జరగుతున్న విషయం తెలిసిందే. కన్నెపల్లి వద్ద భారీగా గోదావరి జలాలు దిగువకు వృథాగా వెళ్తున్నాయని..

రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల అంశంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నడుమ పెద్దఎత్తున రాజకీయ విమర్శ, ప్రతివిమర్శలు జరగుతున్న విషయం తెలిసిందే. కన్నెపల్లి వద్ద భారీగా గోదావరి జలాలు దిగువకు వృథాగా వెళ్తున్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది.కన్నెపల్లి పంపు హౌస్‌లో మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తి పోయాలని గులాబీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

అయితే, ఎన్‌డీఎస్ఏ నీటిని ఎత్తిపోస్తే బ్యారేజీలు కొట్టుకుపోతాయని నివేదిక ఇచ్చిందని, అందుకే తాము నీటిని లిప్ట్ చేయబోమని.. బ్యారేజీలకు రిపేర్లు చేశాకే పంపులు ఆన్ చేస్తామని అధికార కాంగ్రెస్ నేతలు, మంత్రులు చెబుతున్నారు. ఓవైపు రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు అరిగోస పడుతున్నారు. సాగు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. వర్షాకాలం సాగు ఇంకా ప్రారంభం కాలేదు.ఎల్ నినో ప్రభావం రాష్ట్రం మీద తీవ్రంగా ఉన్నది. ప్రాజెక్టులు అడుగంటుతున్నాయి. అయితే, బ్యారేజీల రిపేర్ల విషయంలో సర్కారు తాత్సారం చేస్తున్నది.

ఈ క్రమంలోనే ఓ న్యాయవాది హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తున్నా మేడిగడ్డ పిల్లర్లు రిపేర్ చేయకుండా ప్రభుత్వం రాజకీయం చేస్తోందని హైకోర్టులో పిటిషన్ వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని, సురక్షితంగా వినియోగించడంలో విఫలం అయ్యారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ పిల్లర్లను NDSA రిపోర్ట్ ప్రకారం పునరుద్ధరించాలని, మిగిలిన రిజర్వాయర్లపై NDSA దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వాలని లాయర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు కన్నెపల్లి, సుందిళ్ల పంప్‌హౌస్‌ల రక్షణపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి, కేంద్రానికి, NDSAకు, సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చింది.తదుపరి విచారణ ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.

#highcourt#notices#central and state government#NDSA#kaleshwaram
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి