కేంద్రసహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే హిందూ విద్యార్థులు అందరూ బొట్టుపెట్టుకోవాలని రూల్ తీసుకొస్తామన్నారు. నగరంలోని సైదాబాద్‍లో ఓ ప్రైవేట్ స్కూల్‌లో హిందూ విద్యార్థులకు ‘కల్మా, సురా ఫతేహా’ చదవాలంటూ హోంవర్క్ ఇచ్చారన్న వివాదంపై కేంద్రమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భయం అనేది లేకుండా బరితెగించి బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. కల్మా, సూరహ్ ఫతే చదవాలని హుకుం జారీ చేయడం దుర్మార్గమన్నారు. సదరు పాఠశాల మీద అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనను హిందూ సమాజమంతా ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.సెక్యూలర్ సంఘాలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని జోస్యం చెప్పారు.
తాము అధికారంలోకి రాగానే హిందూ విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తామని ప్రకటించారు. హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను పాటించేలా తప్పకుండా చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి వెల్లడించారు. ఇదిలాఉండగా, ఆటో వెనుక ‘మతం మారితే తండ్రిని మార్చుకున్నట్టే’ అని రాసుకున్న డ్రైవర్ భరత్‌ను పోలీసులు, మజ్లిస్ నాయకులు వేధింపులకు గురి చేశారన్నారు.
https://x.com/muchatlu_/status/2077483236473917510?s=20
భరత్‍ను వేధించిన పోలీసులు, మజ్లిస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.ఇలాంటి ఘటనలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తే తెలంగాణ అంతటా విస్తరించే ప్రమాదం ఉందన్నారు. భరత్ రాసిన దాంట్లో తప్పేముంది? హిందువులను కించపర్చేలా ఉర్దూలో ఆటోల్లో, గోడలపై రాసుకున్న వాళ్లపై ఎందుకు కేసులు పెట్టడం లేదు? అని నిలదీశారు. మజ్లిస్ వాళ్లకో న్యాయం? భరత్‌కు మరో న్యాయమా? అని బండి ప్రశ్నించారు.












